ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ జరిగింది రైలు ప్రమాదం అస్సలే కాదనీ.. ముందస్తు కుట్రతోనే భారీ విధ్వంసానికి ప్లాన్ చేసి అమలు చేశారనీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఫెయిల్ కావటం వల్లనే ప్రమాదం జరిగింది అనేది వాస్తవమేననీ.. కాకపోతే అది యాధృచ్ఛికంగా జరిగింది కాదనీ.. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లోని సెట్టింగ్స్ ను ఎవరో కావాలని మార్చేశారనీ ఆయన చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యులను కూడా గుర్తించాని చెప్తున్న రైల్వే మంత్రి.. ఇంత కంటే ఎక్కువ వివరాలు వెల్లడించటం మంచిది కాదంటూ దాటవేశారు. ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు రైల్వే మంత్రి.
ప్రమాదం జరిగిన సమయంలో రైళ్ళు నడుపుతున్న లోకో పైలెట్ల తప్పు అసలు లేదనీ.. అలాగే అందరూ వేగం పరిమతిలోనే రైళ్ళను నడిపిస్తున్నారనీ స్పష్టంగా చెప్పారు. ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఆటోమేటిక్ గా పని చేస్తుందనీ.. దాన్ని మెషీన్ సెట్టింగ్స్ లో రాకూడని మార్పులు వచ్చాయనీ.. అయితే ఆ మార్పులు వాటంతట అవి వచ్చిన కావనీ.. ఎవరో కావాలనే ఈ దారుణానికి ఒడిగట్టారనీ చెప్పారు అశ్వనీ వైష్ణవ్. ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో ఏవైనా తప్పులు జరిగితే అన్ని రైల్వే ట్రాక్ లపై రెడ్ సిగ్నల్ పడిపోతుందనీ.. ఎక్కడి రైళ్ళు అక్కడే నిలిచి పోతాయనీ చెప్పారు. కానీ తప్పు జరిగినప్పటికీ రెడ్ సిగ్నల్స్ పడకుండా వ్యవస్థను మార్చేశారన్నారు. దీనిపై సీబీఐ విచారణ మొదలైందనీ.. త్వరలోనే పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతామని చెప్పారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 3 వందల మంది రక్త సంబంధీకులకు ఇప్పటికే 10 లక్షల నష్ట పరిహారాన్ని అందజేశామనీ.. గాయపడిన వారికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు వైద్యం అందిస్తున్నామనీ చెప్పారు. ప్రమాదం జరిగినప్పటి నుంచీ ఇది ఎవరో కావాలని చేశారన్న వాదన వినిపిస్తూనే ఉన్నది. వందే భారత్ రైళ్ళ విషయంలో విమర్శలు చేసిన వారే ఈ కుట్రకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇది తీవ్రవాదుల కుట్ర అయి ఉండొచ్చన్న అభిప్రాయం కూడా వినిపించింది. ఎట్టకేలకు స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి ఇది యాధృచ్ఛికం కాదనీ.. ప్రమాదం వెనుక కుట్ర ఉందనీ చెప్పటం భయాందోళనలు కలిగిస్తోంది.