ఇంటర్నేషనల్ అవార్డులన్నీ కొల్లగొడుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రతిష్టాత్మక HCA అవార్డు వరించటం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ టీమ్ తరఫున రామ్ చరణ్ ఈ అవార్డును అమెరికాలో జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో అందుకున్నాడు. అయితే.. దీనిపై వివాదం నడిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో రామ్ చరణ్ కు మాత్రమే HCA అవార్డు వచ్చినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందనీ.. అవార్డు వచ్చింది రామ్ చరణ్ కు కాదు.. సినిమా యూనిట్ కు అనీ వాదనలు కనిపించాయి సోషల్ మీడియాలో. చివరకు దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఇది సినిమా యూనిట్ మొత్తానికి వచ్చిన అవార్డే.. కానీ ఎన్టీఆర్ అందుబాటులో లేక రామ్ చరణ్ సింగిల్ గా తీసుకున్నాడంటూ వివరణ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు దీనిపై HCA కూడా క్లారిటీ ఇచ్చింది.
తాము సినిమా యూనిట్ కు అవార్డు ప్రకటించామనీ.. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ను కూడా అవార్డు అందుకోటానికి ఆహ్వానించామనీ HCA క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ఎన్టీఆర్ వేరే షూటింగ్ ఉండటం వల్ల తాను అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు తమకు సమాచారం ఇచ్చాడని కూడా HCA పేర్కొంది. దీనిపై ఎన్టీఆర్ వర్గం వాళ్ళు స్పందించారు. ఎన్టీఆర్ ఎలాంటి షూటింగ్ లో పాల్గొనలేదనీ.. సోదరుడు మరణించటం వల్ల అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు చెప్పారు. దీనిపై కూడా HCA మరోసారి స్పందించింది. వేరే సినిమా షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోతున్నట్టు ఎన్టీఆర్ తమకు చెప్పారనీ.. అలాగే సోదరుడు మరణించి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు కూడా తమకు చెప్పారనీ HCA పేర్కొంది. మొత్తానికి ఈ వివాదానికి తొందరగానే ఎండ్ కార్డ్ పడింది.