నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి ఇండియన్ సినిమా సత్తా ఖండాంతరాలు చాటి చెప్పిన సంగీత దర్శకుడు కీరవాణి.. అమెరికాలో జరిగిన వేడుకల్లో అవార్డును అందుకున్నాడు. తన జీవితంలో ఈ క్షణం చాలా ముఖ్యమైన మరిచిపోలేని జ్ఞాపకం అంటూ ఎమోషనల్ అయిన కీరవాణి.. ప్రస్తుతం గత నాలుగైదు వారాల నుంచి స్వల్ప అనారోగ్యంతో ఉన్నాననీ.. కాస్త ఇబ్బందిగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తనతో పాటు తన భార్య పిల్లలను కూడా లాస్ ఏంజెల్స్ లోనే ఉన్నారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ కోసం పనిచేసిన రోజుల్లో తిండి నిద్ర మాని పనిచేయాల్సి వచ్చిందని చెప్పిన కీరవాణి.. తనలోని ది బెస్ట్ కోసం ఎంత కష్టమైనా ఎదుర్కుంటానన్నారు.
ఆరోగ్యం కాస్త మెరుగైన తర్వాత కొత్త సినిమాల కోసం పనిచేయాల్సి ఉందన్నారు కీరవాణి. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాననీ.. ఆ తర్వాత అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా కూడా మొదలు పెట్టాల్సి ఉందనీ చెప్పారు. తాను మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డ్ ఫంక్షన్లకు కూడా అటెండ్ కావాల్సి ఉందన్నారు. లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుతో పాటు క్రిటిక్ చాయిస్ మూవీ అవార్డు ఫంక్షన్లకు కూడా హాజరై.. ఆ తర్వాత కుటుంబంతో భారత్ తిరిగి వెళ్తానని చెప్పారు.