అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై ఎలా రియాక్ట్ అవ్వాలో.. ఎవరికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో పక్కాగా తెలిసిన నేతగా ప్రధాని మోడీ ఆండ్ టీమ్ కు బాగా తెలుసు. ఇప్పటికే చాలా సదస్సుల్లో ఇది రుజువైంది కూడా. ఉక్రెయిన్-రష్యా యుద్ధం లాంటి సెన్సిటివ్ ఇష్యూపై గతేడాది షాంఘై శిఖరాగ్ర సదస్సులో మోడీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ టైంలో పుతిన్‌తో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా ముగించాలని మోడీ కోరారు. ఇది యుద్ధంకాలం కాదని చెప్పారు. ఈ పరిణామాన్ని అమెరికా సహా ప్రపంచంలోని ఏ ఒక్కదేశం ఊహించలేదు. యుద్ధం విషయంలో ఎవరి పక్షానా నిలవని నేతగా.. పుతిన్‌తో భేటీ అంటే ద్వైపాక్షిక అంశాలు, వాణిజ్యంపై చర్చవరకే పరిమితం అవుతారని అంతా అనుకున్నారు.
కానీ.. మోడీ మాత్రం యుద్ధం అంశాన్ని ప్రస్తావించి మరీ కీలక వ్యాఖ్యలు చేయడం.. అదికూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కావడంతో ఆ ఎపిసోడ్‌పై అప్పట్లో రోజుల తరబడి డిబేట్లు నడిచాయి. మోడీ ప్రకటనకు అమెరికా సహా ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా నిలిచాయి. ఇదే టైంలో పుతిన్ కూడా మోడీ వ్యాఖ్యలకు నొచ్చుకోలేదు. ఫలితంగా భారత ప్రధాని యుద్ధం ముగిసేలా పుతిన్‌ను ఒప్పించాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఇప్పుడు అదే షాంఘై శిఖరాగ్ర సదస్సు సాక్షిగా ప్రధాని మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు యుద్ధాన్ని టార్గెట్ చేస్తే.. ఇప్పుడు ఉగ్రవాదం అంశంలో కుండబద్దలు కొట్టారు.
షాంఘై శిఖరాగ్ర సదస్సు సాక్షిగా ఉగ్రవాదంపై షెహబాజ్ షరీఫ్, జిన్‌పింగ్‌కు మోడీ ఇచ్చిన ధమ్కీ.. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి ఎస్‌సీఓ దేశాలు ఏమాత్రం వెనకాడవద్దన్నారు ప్రధాని మోడీ. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదనీ.. పాకిస్తాన్, చైనాను ఉద్దేశించి చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి షాంఘై సహకార సంస్థలోని దేశాలు ఏ మాత్రం వెనకాడకూడదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటిద్వంద్వ వైఖరి ఉండకూడదని పేర్కొన్నారు. సీమాంతరఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించడానికి అస్సలు సంకోచించకూడదని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. మోడీ ఈ వ్యాఖ్యలతో బిత్తరపోవడం షెహబాజ్ షరీఫ్, జిన్‌పింగ్ వంతయింది. ఎందుకంటే ప్రపంచంలో టెర్రరిస్టులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దేశంగా పాకిస్తాన్ ఉంది. అలాగే, ఆ దేశ ఉగ్రవాదులకు అంతర్జాతీయ వేదికలపై మద్దతిస్తున్న దేశంగా చైనా నిలుస్తోంది. దీంతో మోడీ ఉగ్రవాదంపై కామెంట్లు చేయడం.. అదికూడా షెహబాజ్ షరీఫ్, జిన్‌పింగ్‌లు ఫ్రేమ్‌లో ఉండగానే ఆ విమర్శలు చేయడం ఇద్దరు నేతలను ఇబ్బంది పెట్టినట్టు కనిపించింది.
చాలా కాలంగా భారత్ ఉగ్రవాదంపై పోరాడుతోంది. ఇటీవలి కాలంలో ఆ పోరాటంలో వేగం పెంచింది కూడా. భారత అధ్యక్షతన జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు సహా మోడీ ఏ దేశంలో పర్యటించినా ఉగ్రవాద ముప్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం రీసెంట్‌గా గేర్ మార్చారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో అయితే నేరుగా పాకిస్తాన్‌నే టార్గెట్ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలోనే క్రాస్ బోర్డర్ ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందుతున్న మార్గాలను మూసివేయాలని కరాఖండీగా చెప్పారు. తాజాగా మరోసారి అలాంటి విమర్శలే చేశారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగటిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారత్ సహించదని పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, కానీ పాకిస్తాన్‌తో కాదని జైశంకర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం కారణంగా పాక్‌తో సాధారణ సంబంధాలు కలిగి ఉండలేకపోతున్నామని అన్నారు.
వీలు చిక్కిన ప్రతిసారీ ఉగ్రవాదం అంశంపై భారత్ తన వర్షన్ వినిపిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలిద్దాం అంటూ పిలుపునిస్తోంది. తాజా సమావేశంలో కూడా మోడీ అదే పని చేశారు. ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కునేందుకు నిర్ణయాత్మకపు చర్యలు తీసుకునే అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ప్రాంతీయంగా, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని సభ్యదేశాలకు పిలునిచ్చారు. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. తాజాగా జరిగిన వర్చువల్ సమ్మిట్‌కు పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ఈ కూటమిలో ఇరాన్ కొత్త సభ్యదేశంగా చేరడాన్ని ప్రధాని స్వాగతించారు. బెలారస్ అధ్యక్షుడు సభ్యత్వం కోసం మోమోరాండం ఆఫ్ ఆబ్లిగేషన్‌పై సంతకం చేయడాన్ని కూడా ప్రధాని స్వాగతించారు. ఏదేమైనా.. ఉగ్రవాదం అంశంపై మోడీ వ్యాఖ్యలతో అయినా పాకిస్తాన్-చైనా తీరులో మార్పు వస్తుందేమో చూడాలి.