టీవీ చానళ్ళకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర సమాచారశాఖ ఈ మేరకు కొత్త రూల్స్ ను ఇచ్చింది. ఇకపై టీవీ చానళ్ళలో రక్తం, మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలతో పాటు హింసాత్మక సన్నివేశాలను ప్రసారం చేయవద్దని గట్టిగా చెప్పింది. కొద్దిరోజుల క్రితం వడోదరలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను బ్లర్ చేయకుండా ప్రసారం చేసిన టీవీ చానళ్ళపై కేసులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆయా చానళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశించింది.
శాటిలైట్ చానళ్ళ ప్రసారాల విషయంలో కొత్తగా ప్రోగ్రామ్ కోడ్ రూపొందించి విడుదల చేసింది. ఈ కోడ్ ను ఉల్లంఘించి ప్రసారాలు చేస్తే ఆయా ఛానళ్ళు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. టీవీ చానళ్ళకు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ చాలా వరకు చానళ్ళు వాటిని పట్టించుకోవటం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. ముబైల్ ఫోన్లతో తీసిన అభ్యంతరకరమైన ఫుటేజ్ ను ఏమాత్రం ఎడిట్ చేయకుండా నేరుగా వార్తా చానళ్ళు ప్రసారం చేస్తున్నాయనీ.. ఇది ప్రజలకు చెడు సందేశాన్ని ఇస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది.