వందేళ్ళకు పైదా చరిత్ర కలిగిన ఇండియన్ సీనియర్ మోస్ట్ పొలిటికల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం అయింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ ఇప్పుడు యూపీఏ పక్షాన నిలుస్తోంది. అందుకు సంకేతంగా ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి జనతాపరివార్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి మోడీని ప్రధాని పదవి నుంచి తొలగించడానికి అందరూ ఐక్యంగా ముందుకు నడవాలని ఆ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు ఈ సమావేశం నాంది పలుకుతుందంటున్నారు. కాంగ్రెస్, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్ అగ్ర నాయకులు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని నిర్ణయించారు.
జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశాన్ని అత్యంత కీలకంగా విపక్షాలు భావిస్తున్నాయి. దీన్నో చారిత్రక సమావేశంగా కాంగ్రెస్ చెబుతోంది. రాబోయే ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుంది. ఆ విషయాన్ని ఒకరోజు ముందే సోనియగా చెప్పగా.. తాజాగా ఖర్గే, రాహుల్ సైతం అవే కామెంట్స్ చేశారు. విపక్ష పార్టీలన్నింటితో కలిసి వచ్చే సార్వ త్రిక ఎన్నికలకు వెళ్లనున్నట్టు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన అడుగు ఢిల్లీ వేదికగా తాజా సమావేశం ద్వారా పడినట్టు రాహుల్ భావిస్తున్నారు. ఇదో ప్రక్రియ గా చెబుతూ దేశం పట్ల ప్రతిపక్ష దృష్టిని పెంచుతుందని అన్నారు.
మరోవైపు.. ఖర్గే సైతం తాజా భేటీని చారిత్రాత్మక సమావేశంగా అభివర్ణించారు. 2024లో బీజేపీ ని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి, కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజల గొంతును పెంచడానికి, దేశానికి కొత్త దిశను అందించడానికి ప్రతిజ్ఞ జరిగిందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, దేశాన్ని కాపాడతాం అంటూ హిందీలో ట్వీట్ చేస్తూ విపక్షాలను ఆకర్షించారు.
బిహార్ సీఎం నితీశ్ గతేడాది నుంచే కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల ఐక్యత దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నితీష్ 2022 సెప్టెంబర్‌లోనూ ఢిల్లీకి వెళ్లారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, డి.రాజాం, సీతారం ఏచూరి, అఖిలేష్ యాదవ్ తదితర నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. గత ఫిబ్రవరిలో సీపీఐ 11వ జనరల్ కన్వెన్షన్‌లోనూ నితీష్ పాల్గొంటూ, విపక్ష ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా చెప్పారు. సమష్టిగా పోరాడితే బీజేపీని 100 సీట్లకు పరిమితం చేయచ్చని తెలిపారు. తాజా సమావేశంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉన్న విపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారిని కలుపుకునే బాధ్యతను పూర్తిగా నితీష్ తన భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది.
బిహార్ బీజేపీ అధ్యక్షుడు మాత్రమే కాదు.. నితీశ్ యాక్షన్‌పై కమలం పార్టీ ముందు నుంచీ ఇవే విమర్శలు సంధిస్తోంది. అయితే, ప్రధాని కావాలన్న ఆశలు తనకు లేవని నితీష్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, ప్రధాని రేసులో చాలాకాలంగా నితీశ్ పేరు వినిపిస్తోంది. బాగా వెనకబడి ఉన్న బీహార్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారనే పేరు నితీష్‌కు ఉంది. అవినీతి లేని పాలన.. మిస్టర్ క్లీన్ ఇమేజ్ నితీశ్ సొంతం. తనకున్న పాజిటివ్ ఇమేజ్‌తో భవిష్యత్తులో తానే ప్రధాని కాగలననేది నితీష్ మనసులో మాటగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తనకు ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకునే ఎత్తుగడలో ఉన్నారాయన. అందుకే, బీఆర్ఎస్ లాంటి వాటి వెనక తాను పడకుండా.. ఎప్పటికైనా బీజేపీ వ్యతిరేక పార్టీలు తన వెంటే నిలుస్తాయనే ధీమాతో ఉన్న నితీశ్.. మొదటినుంచీ ఎలాంటి కూటములను ప్రోత్స హించడం లేదనే చర్చ జరుగుతోంది. తాజా యాక్షన్ కూడా ఇందులో భాగమే అయ్యుండచ్చే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించారు కాబట్టి నితీశ్ ప్రధాని రేసులో లేనట్టు కాదు.
ఎందుకంటే కాంగ్రెస్ నేతృత్వంలో నడవడానికి మెజారిటీ పార్టీలు ఓకే చెప్పినా రాహుల్‌ను ప్రధాని చేయడానికి మాత్రం అంగీకరించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఒకవేళ విపక్ష పార్టీలు ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ ను కాదనే పరిస్థితే వస్తే నితీశ్ కుమార్‌కే అవకాశం వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం విపక్ష పార్టీల్లో మిస్టర్ క్లీన్‌గా బిహార్ సీఎంకు పేరుండడం ఒకటయితే, బీజేపీపై పోరాటంలో విపక్ష పార్టీలను ఏకం చేయడంలోనూ కీలక పాత్ర పోషించడం కూడా అనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే నితీశ్ కుమార్ ఐక్యతారాగం అందుకుంటున్నారనేవారు కూడా లేకపోలేదు. అయితే, బీజేపీని ఢీకొట్టడానికి హస్తానికి షేక్‌హ్యాండ్ ఇచ్చేదెవరు? హ్యాండ్ ఇచ్చేదెవరనే దానిపైనే విపక్షాల ఐక్యతయినా, నితీశ్ ప్రధాని ఆశలైన సజీవంగా ఉండేది.
విపక్షాల ఐక్యతపై కొన్ని పార్టీలు తమ స్టాండ్‌ను క్లియర్ చేయగా.. మరికొన్ని పార్టీలు మిక్సిడ్ సంకేతాలే ఇస్తున్నాయి. ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తొలుత ప్రకటించింది. నార్త్‌ఈస్ట్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య కుదిరిన అవగాహన వల్లే ఓటమి జరిగిందని తృణమూల్ ఆరోపించింది. అయితే, రాహుల్ గాంధీ తన మోడీ ఇంటిపేరు వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత పార్టీ తనవైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపించింది. వెంటనే, బెనర్జీ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి బిజెపిని అధికారంనుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఫ్రంట్‌లో చేరడంపై తన స్టాండ్‌ను ఇంకా స్పష్టం చేయని మరో కీలక ప్రతిపక్ష శక్తి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీకి ఇటీవల జాతీయ హోదా లభించి ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉంది. ఈ నెల మొదట్లో మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ఐక్యత ముఖ్యం అనీ, ప్రతిపక్ష ఐక్యత కాదని అన్నారు. ఒకరిని ఓడించేందుకు కలిసి వచ్చామని పార్టీలు చెబితే ప్రజలకు నచ్చడం లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష ఫ్రంట్ కోసం ఎత్తుగడలు వేసింది కానీ అందులో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదు. ఇక.. మరో కీలక సీనియర్ నేత శరద్ పవార్ అయితే ఇటీవల బీజేపీకి ఫేవర్‌గా కామెంట్ చేయడం విపక్షాల ఐక్యతను గట్టిగానే ప్రశ్నించింది.
ఇలాంటి సమయంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఎంతవరకూ ఎదుర్కోగలుగుతాయనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నితీశ్ కుమార్ తాజా ప్రయత్నాలు ఫలించి ఏకతాటిపైకి వచ్చినా సీట్ల సర్ధుబాటు దగ్గర నుంచి ప్రధాని అభ్యర్ధి ఎవరనేదాని వరకూ ఒక్క మాటపై నిలబడ్డం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ 2024 ఎన్నికల సమయం వరకూ ఐక్యత ప్రయత్నాలే కొనసాగి అందులో విఫలమైతే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు. ఈ ప్రయత్నాలు చేసి ఐక్యత సాధించడంలో విఫలమైతే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం కూడా ఎదురు కావొచ్చు. మరి ఈ అంశంలో నితీశ్ కుమార్ ఎంతవరకూ విజయం సాధిస్తారో చూడాలి.