పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం నెక్ట్స్ టార్గెట్ ఏంటనే సంచలన విషయాన్ని అతని మేనల్లుడు అలీషా పార్కర్ బయటపెట్టాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. అందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న కేసులో అరెస్ట్ అయిన దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషాను..NIA అధికారులు విచారించారు. అయితే విచారణలో దావూద్‌కు సంబంధించిన అనేక కీలక విషయాలను వెల్లడించాడు. అలీషా తెలిపిన వివరాలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. భారత్‌లోని అనేక మంది ప్రముఖ నేతలు, వ్యాపారవేత్తలపై దాడులు చేసేందుకు దావూద్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడని…ఈ గ్యాంగ్ పెద్ద పెద్ద నగరాల్లో అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడుతుందని అలీషా NIA విచారణలో బయటపెట్టాడు. ప్రస్తుతం కరాచీలో ఉంటున్న దావూద్ కుటుంబంతో పాటు మరో ప్రాంతానికి తన మకాం మర్చాడని వివరించాడు. ప్రస్తుతం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం..అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్‌లోని కరాచీ డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గ వెనుక నివసిస్తున్నాడని తెలిపాడు.
అంతేకాదు..దావూద్‌కు నలుగురు సోదరులు, సోదరీమణులు ఉన్నారని అలీషా తెలిపాడు. దావూద్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు వివరించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ..NIA విచారణలో దావూద్ మొదటి భార్య మెహజబీన్ గురించీ అలీషా అనేక కీలక విషయాలను బయటపెట్టాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 2022 సెప్టెంబర్ నెలలో రెండో పెళ్లి చేసుకున్నాడని వివరించాడు. తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీషా చెప్పాడు. దావూద్ రెండవ వివాహం మెహజబీన్ నుంచి దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చని NIA అధికారులు అనుమానిస్తున్నారు. 2022 జులై నెలలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని, రెండో మహిళతో దావూద్ వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా వివరించాడు. మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా భారతదేశంలోని బంధువులతో దావూద్ సంబంధాలు కొనసాగిస్తున్నాడని అలీషా తెలిపాడు.
అనేక నేరాలకు పాల్పడి అండర్ వరల్డ్ డాన్‌గా ముద్రపడిన దావూద్ ఇబ్రహీం నేర చరిత్రను చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. షేక్ దావూద్ ఇబ్రహీం, హాజీ మస్తాన్ గ్యాంగ్‌తో తన నేర సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ముంబై అండర్ వరల్డ్‌లో కీలకంగా ఎదిగాడు. అయితే మస్తాన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్‌ను స్వాధీనం చేసుకొని ముఠాను మరింత పెద్దదిగా మార్చాడు. ప్రపంచంలోనే లార్జెస్ట్ క్రైమ్ సిండికేట్లలో ఒక దాన్ని దావూద్ నడుపుతున్నడంటే..ఇతని నెట్‌వర్క్ ఎంతలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. 1993 ముంబై పేలుళ్ల సూత్రదారి అయిన దావూద్ ఇబ్రహీం 12 చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. అంతేకాదు ఈ దాడుల్లో దాదాపు 700 మంది తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దావూద్‌ను గుర్తించింది. అంతేకాదు 2003లో దావూద్ ఇబ్రహీంను, భారత దేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాయి. అంతేకాదు దావూద్‌పై 25 మిలియన్ డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. దీంతో అరెస్ట్‌ను తప్పించుకోవడానింకి దావూద్ పాకిస్తాన్‌లో తల దాచుకుంటున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ పేరుతో భారత్‌లో ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసిందని గతంలోనే ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, అల్‌ఖైదా, జైషే మహ్మద్ వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు ఈ డీ కంపెనీ కీలక సమాచారం అందిస్తోంది. అంతేకాదు..ఆఫ్రికా దేశాలను డీ కంపెనీ పట్టి పీడిస్తోంది. నైజీరియాకు చెందిన బోకో హరమ్ ఉగ్ర సంస్థలో కూడా డీ కంపెనీ పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలింది. ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధింత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో..దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను సైతం దావూద్ నడిపించాడనే ఆరోపణలున్నాయి.
దావూద్ మేనల్లుడు అలీషా చెప్పిన వివరాల ప్రకారం అండర్ వరల్డ్ డాన్..పాకిస్తాన్‌లోని కరాచీలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారిన పాకిస్తాన్‌లోనే ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని ఇంకా నడిపిస్తున్నాడు. పాక్‌లో ఉంటూనే భారత్‌లోని తన బంధువులతో నిత్యం వాట్సాప్ కాల్స్‌లో టచ్‌లో ఉంటున్నాడు. అయితే అండర్ వరల్డ్ డాన్‌ను ఎలాగైనా అంతమొందించాలన్న లక్ష్యంతో ఇటు భారత్‌తో పాటు అమెరికా, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా వేట ప్రారంభించాయి. దావూద్‌ను అంతమొందించేందుకు అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు రంగంలోకి దిగినట్లు సమాచారం.