షారూఖ్ ఖాన్ కొత్త సినిమా పఠాన్.. రికార్డులు బ్రేక్ చేస్తోంది. 100 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన పఠాన్.. రెండో రోజు జోరు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రెండు రోజుల్లో 220 కోట్ల కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వారం రోజుల్లో ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను మార్చేయబోతోందంటూ అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. మొదటి రోజు కన్నా ప్రేక్షకుల్లో రెండో రోజు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందనీ.. ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ రావటంతో రాను రాను సినిమాకు బుకింగ్స్ పెరిగి కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని టాక్. బ్లాక్ బస్టర్లు లేక వెనుకపడిపోయిన బాలీవుడ్ కు పఠాన్ భారీ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.
పఠాన్ లో ఇండియన్ రా ఏజెంట్ గా షారూఖ్ కనిపించాడు. ఓ భారీ మిషన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి భారత్ సత్తా చాటే కథ ఇది. భీభత్సమైన యాక్షన్ సీన్లు.. థ్రిల్లింగ్ అంశాలతో పఠాన్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ పఠాన్ కు అదనపు బలంగా మారిందని రివ్యూయర్ల మాట. ట్రోలింగ్స్.. ఆ తర్వాత బాయ్ కాట్ షారూఖ్.. ఆ తర్వాత బాయ్ కాట్ దీపికా.. ఇలా ఎన్నో అవాంతరాలు దాటి విడుదలైన పఠాన్.. అన్ని నెగెటివ్ అంశాలను దాటేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.