రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్‌కు ఇప్పటివరకూ మద్దతుగా నిలుస్తూ వస్తున్న నాటో కూటమి దేశాలు ఒక్కచోటకు చేరాయి. లిథువేనియా వేదికగా కీలక సమావేశాన్ని మొదలుపెట్టాయి. ఈ సమావేశం లక్ష్యం ఉక్రెయిన్, స్వీడన్ నాటో ఎంట్రీపై స్పష్టత తీసుకురావడంతోపాటు.. నాటో కూటమి దేశాల భద్రతను మరింత పటిష్టం చేయడమే. రెండు రోజులుపాటు లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగే ఈ సమావేశంలో
అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా 31 దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే స్వీడన్ నాటో ఎంట్రీకి అంతా సిద్ధమైంది. తుర్కియే ఒక్కటే అడ్డుపడుతోంది. అదీ మమ అంటే స్వీడన్ 32వ సభ్యదేశంగా నాటోలో చేరిపోయినట్లే. యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి తమకు మద్దతిస్తే స్వీడన్‌ను నాటోలో చేరడానికి అంగీకరిస్తామని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ మెలిక పెట్టారు. ఇక ఉక్రెయిన్‌కు మాత్రం నాటో ఎంట్రీ అంత ఈజీ కాదనే అనిపిస్తున్నది.
పైకి రష్యాపై నాటో దేశాలు ప్రగల్భాలు పలికినా.. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకునే విషయంలో మాత్రం పుతిన్ ను చూసి భయపడుతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే.. యుద్ధం మొదలై 500 రోజులు దాటి పోయింది. ఇప్పటి వరకూ ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకునే విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇకపై కూడా ఆ దిశగా నాటో దేశాలు కదిలే అవకాశాలు కనిపించటం లేదు. కాకపోతే.. నాటోలో చేర్చుకోకపోయినా సరే ఆయుధ, ఆర్థిక సాయం మాత్రం చేస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై ఉక్రెయిన్ సంతోషంగా లేదు. ‘‘తలుపులు తెరిచి ఉన్నాయంటే సరిపోదు. లోపల మేం ఉండాలి’’ నాటో సభ్యత్వంపై ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలివి.
నిజానికి.. 2008లో రుమేనియాలోని బుకారెస్ట్‌లో జరిగిన సదస్సులోనే ఉక్రెయిన్‌ను కూటమిలోకి చేర్చుకుంటామని నాటో హామీ ఇచ్చింది. కానీ ఆ దేశం చేరికపై తొలి నుంచీ సభ్యదేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. రష్యాతో యుద్ధం పీక్స్‌కు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సభ్యత్వ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని అమెరికా, జర్మనీ లాంటి కూటమి దేశాలు భావిస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే ఆలస్యమైందని.. కూటమిలోకి ఉక్రెయిన్‌ను ఆహ్వానించాలని, సత్వరం సభ్యత్వం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల జెలెన్‌స్కీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిశారు. ఆ భేటీలో నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌కు అర్హత ఉందన్నారు.
నాటోలో32వ దేశంగా స్వీడన్ చేరడానికి మెలికలు పెడుతున్న ఎర్డోగాన్.. ఉక్రెయిన్ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిస్తే రష్యా రెచ్చిపోతుందన్నది అనవసర ఆందోళన మాత్రమేనని మద్దతిచ్చే దేశాలు చెబుతున్నాయి. ఇటీవల ఫిన్లాండ్‌ను కూటమిలోకి చేర్చుకున్నప్పుడు రష్యా పెద్దగా స్పందించని విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
ఉక్రెయిన్ నాటో ఎంట్రీకి మద్దతిచ్చే దేశాల వర్షన్ అటుంచితే.. ఈ వ్యవహారంలో ఉక్రెయిన్‌కు కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది రష్యాతో యుద్ధమే. ఎందుకంటే, నాటో కూటమిలో చేరే దేశానికి రో దేశంతో యుద్ధంలో ఉండకూడదనేది ప్రధాన నియమం. నాటో రాజ్యాంగం ప్రకారం కూటమిలోని ఏ ఒక్కరిపై యుద్ధం జరిగినా మిగిలిన అందరిపైనా యుద్ధంగానే పరిగణించి ఆ దేశానికి కూటమి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇస్తే రష్యాతో అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా నాటో కూటమిలోని దేశాలన్నీ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగినట్లే. ఉక్రెయిన్ తరఫున అమెరికా నేరుగా రష్యాతో పోరాడాల్సిందే. అంటే యుద్ధం విస్తరించినట్లే. ఒక రకంగా అది మూడో ప్రపంచ యుద్ధమన్నమాటే. మరోవైపు.. అధికారిక సభ్యత్వం ఇవ్వకున్నా ఉక్రెయిన్‌కు ఓ సభ్య దేశానికి ఇవ్వాల్సినంత మద్దతిస్తున్నామన్నది నాటో వాదన. ఆర్థికంగా, ఆయుధాలపరంగా ఉక్రెయిన్‌ను నాటో పెద్దన్నలా ఆదుకుంటోంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పు డు కూటమిలో చేరకపోయినా ఉక్రెయిన్‌కు వచ్చిన నష్టమేం లేదని నాటో తన వర్షన్‌గా చెబుతోంది.
నాటో కూటమిలో సభ్యత్వానికి కొన్ని ఆర్థిక, రాజకీయ, మిలిటరీ ప్రమాణాలు కూడా న్నాయి. ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉండాలని నాటో కోరుకుంటుంది. ఉక్రెయిన్ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలపై నాటోకు నమ్మకం లేదు. ఆ దేశంలో అవినీతి భారీ స్థాయిలో ఉందన్నది వారి అభిప్రాయం. అలాగే, నాటోలో సభ్యత్వం రావాలంటే సభ్య దేశాలన్నీ అంగీకరించాలి. ఏ ఒక్కరు అడ్డుకున్నా సభ్యత్వం రాదు. ఇప్పటివరకు స్వీడన్ ఎంట్రీపై తుర్కియే వైఖరే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఒక్క దేశం ఓకే చెబితే స్వీడన్ ఎప్పుడో నాటో దేశంగా మారిపోయేది. ఉక్రెయిన్‌కు కూడా అలా అడ్డుపడే దేశం ఒకటుంది. ఆ దేశం హంగేరీ. ఉక్రెయిన్-హంగేరీ దేశాల మధ్య కొన్ని సమస్యలున్నాయి. అందుకే నాటో సభ్య దేశమైనా ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌కు హంగేరీ పెద్దగా మద్దతివ్వడం లేదు. పైగా పుతిన్‌వైపు మాట్లాడుతోంది. ఫ్రాన్స్, జర్మనీలు ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటన్నింటికీమించి.. రష్యాపై దాడికి నాటో ప్రయత్నిస్తోందంటూ అధ్యక్షుడు పుతిన్ పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే ఆ ఆరోపణలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. పుతిన్‌కు అన్ని విధాలా బలం చేకూరుతుంది. అది నాటోకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. అందుకే ఉక్రెయిన్‌కు బయటి నుంచి మద్దతుకే పరిమితమవుతోంది.
ఈ లెక్కలన్నీ తెలిసిన ఉక్రెయిన్ తాజా లిథువేనియా భేటీకి ముందు కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్చుకోమని తాము అడగ డం లేదనీ.. యుద్ధం ముగిసిన తర్వాతే తమను నాటోలో చేర్చుకోమంటున్నామని తెలిపింది. అయితే చేరికపై రాజకీయ నిర్ణయం, మార్గసూచీ ప్రకటించాలని కోరుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఉక్రెయిన్ నాటో చేరికపై స్పష్టత ఇవ్వాలంటోంది. ఈ నేపథ్యంలో లిథువేనియాలోని ఈ వ్యవహారం నాటోకు అగ్నిపరీక్షగానే కనిపిస్తోంది. మరీ ఈ భేటీ పూర్తయ్యేలోపు కూటమిలోని దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.