ఏపీ రాజకీయం యమరంజుగా మారుతోంది. మొన్నటికిమొన్న సేనాని వారాహితో ఎంట్రీ ఇచ్చి రాజకీయ రణరంగానికి సైరన్ మోగిస్తే.. ఇప్పుడు టీడీపీ వంతొచ్చింది. తెలుగు తమ్ముళ్లు కోటి ఆశలు పెట్టుకున్న యువగళంలో లోకేష్ తొలి అడుగు పడింది. తండ్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఫస్ట్ స్టెప్ తీసుకున్న లోకేష్.. తొలిరోజే తనలోని రాజకీయ పరిణితి చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచడం దగ్గర నుంచి విపక్షాల మద్దతుగా జీవో నంబర్ 1పై విరుచుకుపడ్డారు. కానీ, లోకేష్ సీరియస్ యాక్షన్‌ను వైసీపీ నాయకులు మాత్రం ఎప్పట్లానే సీరియస్‌గా తీసుకోలేదు. యువగళం కార్యక్రమాన్ని అప్రయోజితం అటూ పేర్ని నాని, అదో పెద్ద జోక్ అంటూ కాకాణి కామెంట్ చేశారు. ఇలా, యువగళం మొదటిరోజే ఏపీ రాజకీయంలో ప్రకంపనలు రేపింది.
యువగళం పాదయాత్రలో భాగంగా అధికార పార్టీపై తొలిరోజు లోకేష్ పేల్చిన పంచ్‌లు ఇవే. ఒక్క ఛాన్స్ జగన్ మూడేళ్లలో రాష్ట్రాల్లో 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారన్నారు. వైసీపీ సర్కార్‌పై అసలైన పోర ఇప్పుడే మొదలైందన్నారు. అయితే, ఈ రెగ్యులర్ విమర్శల్లోనూ పొలిటికల్‌గా కలిసొచ్చే కామెంట్లుచేశారు.
విపక్షాల పాదయాత్రలు, పొలిటికల్ టూర్లపై అధికార పార్టీ వైఖరిని తప్పుబడుతూ పొలిటికల్ గళం వినిపించారు. “చంద్రబాబును అడ్డుకున్నారు సహించా.. పవన్‌ను ఆపేశారు భరించా.. ఈ సారి మాత్రం తగ్గేదే లే” అంటూ సవాళ్లు షురూ చేశారు.
నిజానికి.. గతంతో పోల్చితే లోకేష్ పనితీరు, బాడీ లాంగ్వేజ్ మారింది. ఇలాంటి టైంలో లోకేష్ జనంలో ఉండడం ఇంకాస్త కలిసొచ్చే అంశమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో లోకేష్ పని తీరుపై సొంత పార్టీ నాయకులు బహిరంగంగా అనేక విమర్శలు చేసేవారు. ఇప్పటికీ ప్రత్యర్ధులు ఆ తరహా విమర్శలు చేస్తూనే ఉన్నారు. లోకేష్ పార్టీకి భారం అని, ఆయన ఆధ్వర్యంలో టీడీపీ ముందుకు వెళ్లడం కష్టమని రకరకాల వ్యాఖ్యలు వినిపించేవి. చంద్రబాబు వయసు రీత్యా చూసుకున్నా, ముందు ముందు ఆయన యాక్టివ్‌గా ఉండే పరిస్థితి కనిపించకపోవడంతో, లోకేష్‌పైనే టీడీపీ భారం పడనుంది. అయితే ఇప్పుడు పాదయాత్ర ద్వారా పార్టీలోను ప్రజలను పట్టు సాధించి తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు లోకేష్ యువగళం కలిసొస్తుంది. ఇక ఈ పాదయాత్ర ముగిసి, 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ ఖాతాలోనే పడుతుందంటున్నారు టీడీపీ శ్రేణులు.