ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓ మహిళ అసెంబ్లీలో అడుగుపెట్టిందేలేదు. అలాంటిది.. 60 యేళ్ళ నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఓ మహిళ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి పోటీ చేసిన హెకానీ జఖాలు.. ఎమ్మెల్యేగా విజయం సాధించింది. దిమాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన జఖాలు.. 1536 ఓట్ల మెజారిటీ విజయం సాధించి రికార్డు సృష్టించింది. 48 యేళ్ళ జఖాలు ఓ సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది.
60 యేళ్ళ క్రితం పూర్తి స్థాయి రాష్ట్రం హోదా సాధించిన నాగాలాండ్ లో ఇప్పటి వరకు 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్నో సార్లు మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక్కసారి కూడా ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. కానీ ఈసారి చరిత్ర తిరగరాసింది జఖాలు. నాగాలాండ్ చరిత్రలో మొదటి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది. మహిళలు, పురుషులు సమానమే అన్న నినాదంతో నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇద్దరు మహిళలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వగా.. జఖావు విజయం సాధించింది. మరో మహిళా అభ్యర్థి సల్హౌతునో కుస్రో ఆధిక్యంలో ఉండి విజయం దిశగా అడుగులేస్తోంది. ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఎన్డీపీపీ బీజేపీలు కలిసి నాగాలాండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.