సూపర్ స్టార్ కృష్ణ శతజయంతి సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా 4కే రిజల్యూషన్ తో. 52 సంవత్సరాల క్రితం విడుదలై తెలుగు సినిమాకు హాలీవుడ్ కౌబోయ్ సినిమా ఫ్లేవర్ రుచి చూపించింది మోసగాళ్ళకు మోసగాడు సినిమా. సూపర్ స్టార్ కృష్ణ చేసిన ట్రెజర్ హంట్ కౌబోయ్ ప్రయోగం టాలీవుడ్ నే కాదు.. ఇండియన్ సినిమానే ఆశ్చర్యపోయేలా చేసింది. అసలు అలాంటి సినిమాల గురించే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమా చూసి థ్రిల్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. పద్మాలయ స్టూడియోస్ సంస్థ ద్వారా నిర్మించబడిన మోసగాళ్ళకు మోసగాడు సినిమాకు అలనాటి అద్భుత దర్శకులు కేఎస్ఆర్ దాస్ మరియు బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు.
హాలీవుడ్ సినిమాలైన ఫర్ ఎ డాలర్ మోర్ మరియు మెకన్నాస్ గోల్డ్ వంటి ట్రెజర్ హంట్ సినిమాల స్ఫూర్తితో బొబ్బిలి రాజవంశం మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన ఓ సంగ్రామ ఫలితంగా జరిగే ట్రెజర్ హంట్ సినిమా ఇది. తెలుగు ఫ్లేవర్ కోసం ప్రతీకారం అనే జానర్ ను కూడా యాడ్ చేసి లవ్ స్టోరీని మిక్స్ చేసి మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ గా రూపొందించారు మోసగాళ్ళకు మోసగాడు సినిమాను. ఇప్పుడు చూసినా ఈ సినిమా ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. అలాంటి సినిమాను కృష్ణ వందో పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులకు కానుకగా ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో ప్లే కావటానికి రెడీ అవుతోంది. మే 31న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 4కే రిజల్యూషన్ తో రూపొందించిన కొత్త ట్రైలర్ ను కృష్ణ కుమారుడు మహేశ్ బాబు విడుదల చేశారు.