కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో జైలు శిక్ష పడి లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ పార్టీకి చెందిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ అనర్హతను ఎత్తివేస్తూ లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ సలీహ్ పై దాడి చేసిన కేసులో ఈ సంవత్సరం జనవరి 10న కవరట్టి కోర్టు మహ్మద్ ఫైజల్ ను దోషిగా తేల్చి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జనవరి 13న లోక్ సభ సచివాలయం ఫైజల్ ను అనర్హుడిగా పేర్కొంటూ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైజల్ కేసు విచారణ కొనసాగుతోందే తప్ప ఇంకా తీర్పు రాలేదు. అయినప్పటికీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సచివాలయం నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రాహుల్ గాంధీని సస్పెండ్ చేసిన లోక్ సభ సచివాలయం.. ఫైజల్ సస్పెన్షన్ ను రద్దు చేయటం గమనార్హం. అయితే.. ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే కంటే ముందు కేరళ హైకోర్టులో కవరట్టి తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. కేరళ హైకోర్లు కవరట్టి కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ తీర్పు చెప్పింది.