ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం రెపరెపలాడుతోంది.. అగ్రదేశం అమెరికా మోడీ మేనియాతో ఊగిపోతోంది.. భారత్ అమెరికా చరిత్రలోనే ఎన్నడూ ఊహించని కీలకమైన ఒప్పందాలు కార్యరూపం దాల్చాయి.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన భారత చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. న్యూయార్క్‌లో ఎన్నారైల ఘన స్వాగతం దగ్గర నుంచి వాషింగ్టన్‌లో బైడెన్ వెల్‌కమ్ చెప్పిన తీరు.. ఇద్దరు అగ్రనేతల ప్రెస్‌మీట్.. ప్రతిష్టాత్మక అమెరికా కాంగ్రెస్‌లో హిస్టారికల్ ప్రసంగం.. వీటన్నింటికీమించి ఇరు దేశాల మధ్య అతి కీలకమైన నాలుగు ఒప్పందాలు.. ఇలా ఒక్కటేంటి ? చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నో.. అన్నట్టుగా సాగింది మోడీ అమెరికా పర్యటన. ఈ పర్యటన ఆధ్యంతం ఇరు దేశాల మైత్రిని మరో స్థాయికి తీసుకెళ్లేలానే సాగింది. వాస్తవానికి.. ప్రధాని అమెరికా పర్యటన ఖరారయిన తర్వాత కొన్ని ప్రశ్నలతోపాటు, మరికొన్ని వివాదాలపైన కూడా చర్చ జరిగింది. దీనికి కారణం మోడీ పర్యటనకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ అమెరికాలో పర్యటించడం.. ఆ తర్వాత భారత్‌లో ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి పరిణామాలే. వీటన్నింటిపై స్పందించాల్సివస్తే మోడీ రియాక్షన్ ఎలా ఉంటుందనే ప్రశ్నలు కాస్త గట్టిగానే వినిపించాయి. అలాంటి ప్రశ్నలకు, వివాదాలకు భారత ప్రధాని తన మాట తోనే బదులిచ్చారు.
మోడీ అమెరికా పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను కీలకంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో శత్రుత్వం, భారత్‌తో పాటు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు.. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం అవసరం చాలానే ఉంది. తాజా ఒప్పందాల్లో అగ్రస్థానం కూడా అలాంటి రక్షణ ఒప్పందాలదే. గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్ లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. ఈ మేరకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్, భారత్‌కు చెందిన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ మధ్య డీల్ ఫిక్స్ అయింది. భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి ఫైటర్ జెట్ తేజస్‌లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను అమర్చుతారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. జెట్ ఇంజిన్ల డీల్‌పై ఇంకాస్త డెప్త్‌కు వెళితే.. ఎఫ్414 ఇంజిన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. ఎఫ్414–ఐఎన్‌ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్‌డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేస్తాయి. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి అమర్చుతోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది.
ఇన్నాళ్లూ రష్యా, యూరప్ దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకోవడం భారత ఆయుధ మార్కెట్‌ను కూడా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లబోతోంది. దీని తర్వాత మరో మూడు కీలక ఒప్పందాలు కూడా జరిగాయి. ఇరుదేశాల నడుమ మారీటైమ్ ఒప్పందం కూడా ఫైనల్ అయింది. ఈ ఒప్పందం ప్రకారం ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలకు ఒకవేళ మరమ్మత్తులు అవసరమైతే.. మన దేశంలోని షిప్ యార్డుల్లో ఆగవచ్చు. అలాగే మరమ్మత్తులు కూడా చేసుకోవచ్చు. ఈ పరిణామం చైనాకు షాక్ ఇచ్చేదే. ఎందుకంటే ఇండో-పసిఫిక్‌లో డ్రాగన్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా-భారత్ నేవీ సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు మరింత వీలవుతుంది.మరో కీలక ఒప్పందం విషయానికొస్తే.. సముద్రాలపై నిఘా కోసం అమెరికా మోస్ట్ అడ్వాన్స్‌డ్ డ్రోన్ భారత్‌కు రాబోతోంది. ఆర్మ్‌డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇటువంటి సాయుధ డ్రోన్‌లకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. ఫైటర్ జెట్‌లు చేయగలిగే పనులు.. అంటే శత్రు లక్ష్యాలపై క్షిపణులతో దాడి చేయడం, మందు గుండు సామగ్రితో విధ్వంసం సృష్టించడం వంటి పనులను ఈ డ్రోన్లు ఈజీగా చేస్తాయి. అలాగే, వీటి నిఘా సామర్థ్యం అసాధారణంగా ఉంటుంది. ఈ డ్రోన్లలోని సాయుధ రకాల్లో హెల్‌ఫైర్ క్షిపణులు అమర్చి ఉంటాయి.
అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ గుజరాత్‌లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. తద్వారా చిప్ మార్కెట్‌లోనూ ఇండియా కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ మార్కెట్‌లో కింగ్ లాంటి కంట్రీ తైవాన్.. తమ ఉత్పత్తులను ఇండియాలో చేయాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో తన మిత్ర దేశం అమెరికా చేసుకున్న ఒప్పందం తైవాన్‌కు మరింత బూస్టింగ్ ఇచ్చేదే. వీటితోపాటు అమెరికాలో ఉన్న భారతీయులకు కూడా మోడీ. బైడెన్‌లు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై హెచ్1-బి వీసాలు అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఇవి మాత్రమే కాదు మరికొన్ని బిగ్ డీల్స్ కూడా ఇరు దేశాల మధ్య జరిగాయి.మోడీ అమెరికా పర్యటనను కేవలం ఒప్పందాల కోణంలోనే చూడలేం. ఈ పర్యటనలో అంతకుమించిన అంశాలు చాలానే ఉన్నాయి. ప్రధాని అమెరికా వెళ్లేకొద్దిరోజులకు ముందు భారత ప్రజాస్వామ్యంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మోడీ కంటే ముందు అమెరికాలో పర్యటించిన రాహుల్ గాంధీ భారత్‌లో మైనారిటీలు నిస్సహాయస్థితిలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మోడీ దేవుడికి కూడా పాఠాలు చెప్పగలరు అంటూ సెటైర్లు వేశారు. మోడీపై సెటైర్లు ఎలా ఉన్నా మైనారిటీ లు నిస్సహాయస్థితిలో ఉన్నారన్న రాహుల్ మాట అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకునేలోపు ట్విట్టర్ మాజీ సీఈవో భారత్‌లో ప్రజాస్వామ్యంపై వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనల సమయంలో తమను బెదిరించారనీ, ఇదీ ప్రజాస్వామ్య భారత్ అంటూ ఎద్దేవా చేశారు. దీనికి కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలవడంతో మరోసారి కమలం వర్సెస్ కాంగ్రెస్ వార్ నడిచింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే మోడీ అమెరికా ఫ్లైట్ ఎక్కారు.
మోడీ అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత కూడా భారత్‌లో ప్రజాస్వామ్యంపై చర్చ జరిగింది. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన దాదాపు 75 మంది ఎంపీలు బైడెన్‌కు లేఖ రాశారు. భారత్‌లో మైనారిటీలపై వేధింపులు, మానవహక్కుల ఉల్లంఘన వంటి అంశాలను లేవనెత్తి, ప్రశ్నించాలని బైడెన్‌ను కోరారు.
మరో ఇద్దరు ఎంపీలు ఇల్హాన్ ఒమర్, రషీదా త్లాయిబ్ అయితే అమెరికా కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అదికూడా.. భారత్‌లో మైనారిటీల అణచివేతకు నిరసనగా అని ప్రకటించి మరీ.. సరిగ్గా ఇలాంటి సమయంలో వైట్‌హౌస్ నుంచి ఓ సంచలన ప్రకటన వచ్చింది. ఇద్దరు అగ్రనేతలు ప్రెస్‌మీట్ నిర్వహిస్తారనీ, అమెరికా నుంచి ఓ ప్రశ్న, భారత్ నుంచి ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తారని ఆ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రెస్‌మీట్‌లో మోడీకి ఎదురైన ప్రశ్నకూడా భారత్‌లో ప్రజాస్వామ్యం గురించే. మైనారిటీల హక్కులను మెరుగుపరచడానికి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఓ పాత్రికేయుడు ప్రశ్నించారు. దానికి మోడీ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుశా?
“మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నే ఉండదు’ అని ప్రధాని స్పష్టం చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదం మీదే తమ ప్రభుత్వం నడుస్తోందని కుండబద్దలు కొట్టేశారు. మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్ని విమర్శలకూ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బైడెన్ దంపతుల ఆతిధ్యం.. అనంతరం హిస్టారికల్ మూమెంట్.. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగం జరిగాయి. సుదీర్ఘ సమయం సాగిన ఈ ప్రసంగం అయితే మోడీ మేనియాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.ఇదీ అమెరికా కాంగ్రెస్‌లో మోడీకి దక్కిన గౌరవం. దాదాపు గంటసేపు సాగిన మోడీ ప్రసంగంలో భారత్ మాతాకీ జై, మోడీ మోడీ నినాదాలు మార్మోగాయి. సరిగ్గా ఈ సమయంలోనే భారత శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు మోడీ. దశాబ్దాలు గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. 9/11, 26/11 దాడుల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, దాని పర్యవసానాలు గురించి వివరించారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉపేక్షించకూడదన్నారు. పరోక్షంగా చైనానూ టార్గెట్ చేశారు. ఐక్యరాజ్యసమితి సూత్రాలు, నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాల్సిందే అని తేల్చిచెప్పారు. ప్రధాని అమెరికాలో అడుపెట్టిన సమయంలోనే డ్రాగన్ ఓ డర్టీ పని చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై అంతర్జాతీయ టెర్రరిస్టు ముద్ర వేసేందుకు భారత్‌తో కలిసి అమెరికా చేసిన ప్రతిపాదనలను చైనా అడ్డుకున్నది. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మిర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేయాలని భారత్‌తో పాటు అమెరికా ప్రతిపాదించాయి. ఐతే, 1267 ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా బ్లాక్ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ ఆ రెండు దేశాలకూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని సంచలన ప్రకటన చేశారు.ఇలా ఒక్కటేంటి తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ప్రపంచానికి భారత్ ఏంటో తెలిసేలా మాట్లాడారు. మరోసారి వశుదైక కుటుంబం అంశాన్ని ప్రస్తావించి ప్రపంచం అంతా ఒక్కటే ఫ్యామిలీ అని గుర్తుచేశారు. మొత్తంగా.. అగ్రరాజ్యంతో రక్షణ ఒప్పందాలతోపాటు భారత్‌పై కొందరు లేవనెత్తిన వివాదాలకు కూడా మోడీ పర్యటన ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది. ఒక్కమాటలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఓ సరికొత్త అధ్యాయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.