భారత్ లో ప్రకంపనలు సృష్టించి స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైన అదానీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించింది. హిండెన్ బర్గ్ నివేదిక.. అదానీ షేర్ల పతనం.. అకౌంటింగ్ ఆరోపణలు.. ఇలా అన్నింటిపై విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కమిటీలో సభ్యులుగా ఉండాల్సిన వాళ్ళను సూచించాలని కూడా కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ లో పంపాలని.. మిగతా అంశాలపై రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అదానీ వ్యవహారంపై ఈ రోజు సాయంత్రం సుప్రీంలో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై విచారణ ఈ నెల 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సుప్రీం ముందు హాజరైన తుషార్ మెహతా.. అదానీ గ్రూపు నష్టాల వల్ల భారత మార్కెట్లపై పడిన ప్రభావాన్ని సెబీ ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాన్ని కాపాడేందుకే తాము అదానీ వ్వహారంపై కమిటీ వేసేందుకు అంగీకరిస్తున్నామని ఆయన చెప్పారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక మీద సెబి, కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేయాలని కోరుతూ మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.