సికింద్రాబాద్ ప్రాంతంలో ఆర్మీకి సంబంధించిన భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించాలని గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా స్పందించటం లేదనీ.. ఇప్పటికీ ఈ విషయంలో వినతులు పంపిస్తున్నా సమాధానం చెప్పటం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ లోని చాలా ప్రాంతాలు ఇండియన్ ఆర్మీకి చెందినవే ఉన్నాయనీ.. ఆయా ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే అందుకు తగిన స్థలాలను ఆర్మీ కోసం ఇతర ప్రాంతాల్లో కేటాయించటానికి తాము సిద్ధంగా ఉన్నామనీ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని పలు స్థలాలపై తెలంగాణ ప్రభుత్వానికి హక్కు లేకపోవటం వల్ల చాలా అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి తొమ్మిదేళ్ళుగా వినతులు పంపిస్తున్నా వారు పట్టించుకోవటం లేదన్నారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసానని చెప్పారు. ఈసారైనా కేంద్రం ఆర్మీ స్థలాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే చాలా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
హైదరాబాద్ లో కొత్తగా 31 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించటానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని కూడా కేటీఆర్ చెప్పారు. ఈ మెట్రో ప్రాజెక్టు విషయంలో కూడా ఆర్మీ స్థలాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. లఖ్నో మరియు అహ్మదాబాద్ లో మెట్రో ప్రాజెక్టు నిర్మించేందుకు కంటోన్మెంట్ స్థలాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారనీ.. ఇక్కడ కూడా అదే విధంగా కంటోన్మెంట్ స్థలాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే మెట్రోకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు కేటీఆర్. ప్రజారవాణా ఎంతగా పెరిగితే అభివృద్ధికి అంత ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నారు. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అత్యుత్తమంగా ప్రజారవాణా మార్గాలు ఏర్పడటమే అసలైన అభివృద్ధి అని చెప్పిన కేటీఆర్.. రవాణా మార్గాలు ఏర్పడిన తర్వాతే మిగతా విషయాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లేదనీ.. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి వెళ్తే వారి నుంచి తిరిగి తెలంగాణకు కేవలం 40 పైసలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని కోరారు.