తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్ ఏపీ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయమే లోకేష్.. తన కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని పాదయాత్రకు సిద్ధమయ్యాడు. దీనిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రియాక్ట్ అయ్యింది. లోకేష్ చేసే పాదయాత్రకు యువగళం అని కాకుండా సర్వ మంగళం అని పెట్టుకుంటే బాగుటుందంటూ సెటైర్లు వేసింది. నారా లోకేష్ ఎప్పుడైతే పార్టీ అధికారిక కార్యకలాపాలు చూడటం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచీ టీడీపీ నాశనం మొదలైందని.. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవటం ఖాయమనీ రోజా వ్యాఖ్యానించింది. చంద్రబాబు, ఆయన కుమారుడు ఓ దశ దిశ లేకుండా పనిచేస్తున్నారనీ.. దీని వల్ల వాళ్ళ పార్టీతో పాటు ప్రజలకు కూడా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.
ఏపీలో నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయనున్నాడు. మొత్తం 400 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేయనున్నాడు. జనవరి 27న చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఏపీ హైకోర్టు అనేక షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే.