మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం తెలంగాణలో అందరికంటే ఎక్కువ ఫేమ్ మరియు ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ సెలబ్రిటీ. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏం మాట్లాడినా అది వార్త అయిపోతుంది. పాలమ్మిన.. పూలమ్మిన.. అంటూ డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో కొద్ది రోజుల పాటు ట్రెండ్ అయ్యాడు మల్లన్న. లేటెస్ట్ గా మరోసారి తన మాటలతో వార్తల్లోకెక్కాడు మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి పోలీసులకు హెల్త్ టిప్స్ చెప్పారు. పోలీసులంటే పూర్తి ఫిట్ గా ఉండాలనీ.. దొంగలు పోలీసులను చూస్తేనే చాలు భయపడిపోయేలా ఉండాలనీ సలహా ఇచ్చారు. బొర్ర ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇయ్యొద్దంటూ హోమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌లకు అడ్వైజ్ ఇచ్చారు మల్లన్న.
ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినా సరే తన గురించి.. తన జీవితంలోని విజయాల గురించి చెప్పుకున్న మల్లారెడ్డి.. ఈ సమావేశంలో కూడా తనను తాను పొగిడేసుకున్నారు. తాను ఈ వయసులో కూడా పూర్తి ఫిట్ గా ఉన్నాననీ.. అందరూ తన లాగే ఫిట్ నెస్ అలవాటు చేసుకోవాలనీ పోలీసులకు అడ్వైజ్ ఇచ్చారు. ప్రతి పోలీస్ స్టేషన్లో జిమ్ ఏర్పాటు చేయాలని హోంమంత్రిని కోరారు. “పోలీసులు బొర్రలు తగ్గించుకోవాలె.. బొర్ర ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇయ్యొద్దు…” అంటూ మల్లన్న మాట్లాడిన మాటలకు వేదికపై ఉన్న హోంమంత్రి మహమూద్ ఆలీతో పాటు పోలీసులు, సభికులు పగలబడి నవ్వారు. ఈ వీడియో అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది కూడా. “అట్లుంటది మనతోటి” అని ట్యాగ్ జోడించి మరీ మల్లన్న ఫ్యాన్స్ తెగ షేర్ చేసేస్తున్నారు ఈ వీడియోను.