వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పష్టమైన వివరాలు చెప్పటం లేదు. ఈ నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన మరో కొత్త వార్త ప్రస్తుతం ఏపీ తెలంగాణలో వైరల్ గా మారింది. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిళ.. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నదనేది ఆ వార్త సారాంశం. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. వైఎస్ సమాధి ఉన్న ఇడుపులపాయను ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారట. ఇప్పటికే ఈ విషయమై నిర్ణయం తీసుకున్నారనీ.. సోనియా, రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే ఇడుపులపాయను పరిశీలించి భద్రత విషయంలో రిపోర్టు ఇచ్చారనీ చెప్పుకుంటున్నారు. కానీ ఇటు షర్మిళ నుంచి గానీ.. అటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి గానీ ఈ విషయమై చిన్న సమాచారం కూడా రావటం లేదు. ఏపీ కాంగ్రెస్ నేత చింతా మోహన్ మాత్రం ఈ వార్తలు కేవలం పుట్టించిన వార్తలేననీ.. సోనియా, రాహుల్ రాక గురించి ఏపీ కాంగ్రెస్ కు కూడా ఎలాంటి సమాచారం లేదనీ చెప్తున్నాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెట్టిన విషయం మనకు తెలిసిందే. సోనియాను కలవటానికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. అందుకే కాంగ్రెస్ కు పోటీగా కొత్త పార్టీ పెట్టారనీ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇంత కాలం జగన్ వెంటే నడిచిన అతడి సోదరి వైఎస్ షర్మిళ.. హఠాత్తుగాా తెలంగాణ ముఖ్యమంత్రి అయి రాజన్న రాజ్యం తేవటమే లక్ష్యం అని చెప్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. ఇంత కాలం పాదయాత్రలు, బస్సు యాత్రలతో జోరుగా రాజకీయం చేసిన షర్మిళ.. గత కొంత కాలంగా సైలెంట్ కావటమే కాకుండా.. కాంగ్రెస్ అగ్రనేతలకు టచ్ లో ఉంటోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన తర్వాత షర్మిళ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారన్న వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడు ఇదే అంశంపై కొత్త కొత్త ప్రచారాలు పుట్టుకొస్తున్నాయి.