గోవాలో సోమవారం ఉదయం భారీ పేలుడు చోటు చేసుకుంది. మాపుసాలోని ఇన్ ఆండ్ అవుట్ హిల్ టాప్ బార్ ఆండ్ రెస్టారెంట్ లో ఈ రోజు ఉదయం 5.33 గంటలకు భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రెస్టారెంట్ లోని గ్యాస్ సిలిండర్ పేలినట్టు తొలుత పోలీసులు భావించారు. కానీ.. మిగితా సిలిండర్లు చెక్కు చెదరకుండా అలాగే ఉండటాన్ని బట్టి సిలిండర్ ను వేరే ఏదైనా పేలుడు పదార్ధం ఉపయోగించి పేల్చారేమో అని అనుమానిస్తున్నారు.
పేలుడులో సుమారు 50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు చెప్తున్నారు. భారీ పేలుడు ధాటికి రెస్టారెంట్ చుట్టుపక్కల ఉన్న 7 ఫ్లాట్లు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల నిలిపి ఉంచిన 6 వాహనాలు కూడా దెబ్బతిన్నాయని పోలీసులు చెప్తున్నారు. అయితే.. ఇది కేవలం సిలిండర్ బ్లాస్ట్ మాత్రమేనా.. ఇంకేమైనా కుట్ర జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ బార్ ఆండ్ రెస్టారెంట్ ఉండటం స్థానికులకు ఇష్టం లేదు. చాలా సార్లు ఈ బార్ వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. కాబట్టి ఏదైనా కుట్ర జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.