గత కొద్ది రోజులు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఉన్న వివాదాలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా మనోజ్ పెళ్ళి, మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు అన్నదమ్ములు కలవకపోవటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏదో వివాదం నడుస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఏ విషయం అనేది తెలియదు కానీ.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. ఏకంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్ళినట్టు కనిపిస్తోంది. విష్ణు.. సారధి అనే వ్యక్తిపై దాడి చేయటానికి సంబంధించిన వీడియోను మనోజ్ ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సారథి అనే వ్యక్తి మోహన్ బాబుకు తమ్ముడు వరస అవుతాడని చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయటంతో ఇంటి పరువు రోడ్డున పడిందంటూ ఆగ్రహానికి గురైన మోహన్ బాబు వెంటనే మనోజ్, విష్ణులతో మాట్లాడి వీడియోను డిలీట్ చేయించాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూర్చొని వివాదం పరిష్కరించుకోవాలంటూ తాను చెప్పినా ఇద్దరూ పట్టింపులకు పోయి తన మాట వినటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సారథి అనే మోహన్ బాబు సోదరుడి వరుస అయ్యే వ్యక్తి వల్ల వివాదం తలెత్తిందని తెలుస్తోంది.. కానీ అదేమిటి అనేది మాత్రం క్లారిటీ రాలేదు.