కశ్మీరీ పండిట్లపై జరిగిన మారణహోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ది కశ్మీర్ ఫైల్స్ సినిమా. 2022 మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉంది. లేటెస్ట్ గా ది కేరళ స్టోరీ సినిమా రిలీజైన నేపథ్యంలో మరోసారి ది కశ్మీర్ ఫైల్స్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి తమ సినిమా గురించి, తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం కలిగించినందుకు బేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఆరోపణలు రుజువు చేయాలని నోటీస్ లో పేర్కొన్నారు. లీగల్ నోటీసుల కాపీలను ట్విటర్ ద్వారా షేర్ చేసారు. తమ సినిమాపై అనుచితంగా మాట్లాడారంటూ ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపించటం బాలీవుడ్ తో పాటు బెంగాల్ లో చర్చనీయాంశంగా మారింది.
కోల్ కతా లోని సెక్రెటేరియల్ ఆవరణలో జరిగిన ప్రెస్ మీట్ లో ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించటం గురించి మాట్లాడుతున్న సందర్భంలో మమతా బెనర్జీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ వర్గాన్ని కించపరిచే, అవమానించే కథ అనీ.. ది కేరళ స్టోరీ కూడా అలాంటి సినిమాయేననీ వ్యాఖ్యానించింది మమత. అంతే కాకుండా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ డబ్బులు సమకూర్చిందంటూ సంచలన ఆరోపణ చేసింది మమతా బెనర్జీ. బీజేపీ నాయకులు వెనకుండి డబ్బులు ఇచ్చి ఇలాంటి సినిమాలు తీయిస్తున్నారు అంటూ బీజేపీపై కూడా ఆరోపణలు చేసింది. తమకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదన్న వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్.. తమపై ఆరోపణలు రుజువు చేయాలి లేదంటే క్షమాపణ చెప్పాలంటూ మమతకు లీగల్ నోటీసులు ఇచ్చారు.