శ్రీలంకను గజగజ వణికించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలమ్ వ్యవస్థాపకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ అలియాసస్ పెద్దపులి ప్రభాకర్ బతికే ఉన్నాడంటూ తమిళనాడు కాంగ్రెస్ నేత నెడుమారన్ వ్యాఖ్యానించటం తమిళనాట సంచలనంగా మారింది. తమిళుల హక్కుల పేరుతో శ్రీలంక ప్రభుత్వంతో యుద్ధం చేసిన ప్రభాకర్ ను 2009లో లంక సైన్యం హతమార్చింది. ప్రభాకరన్ తో పాటు అతడి కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపింది శ్రీలంక సైన్యం. కానీ నెడుమారన్ మాత్రం ప్రభాకరన్ బతికే ఉన్నాడనీ.. తనకు, తన కుటుంబ సభ్యులతో ప్రస్తుతం ఆయన టచ్ లోనే ఉన్నాడనీ చెప్తున్నాడు. ఎల్టీటీఈని మళ్ళీ పునరుద్ధరించి గత వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విలేఖరుల సమావేశంలో నెడుమారన్ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మిగతా పార్టీ నేతలు మాత్రం స్పందించలేదు.
తమిళుల హక్కుల పేరిట దశాబ్ధాల పాటు శ్రీలంకలో ఎల్టీటీఈ ప్రభాకరన్ తిరుగుబాటు చేశాడు. అప్పట్లో ఎల్టీటీఈ ప్రపంచంలో ఎయిర్ ఫోర్స్ కలిగిన ఏకైక తీవ్రవాద సంస్థగా ప్రకటించబడింది. ఎల్టీటీఐ సైన్యం దాదాపు శ్రీలంక సైన్యానికి సమానంగా భావించే వారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చింది కూడా ఎల్టీటీఈ తీవ్రవాదులే. వీరి అరాచకాలు తీవ్రం కావటంతో శ్రీలంక సైన్యం ఎల్టీటీఈపై మిలిటరీ యాక్షన్ ప్రకటించి దొరికిన వారిని దొరికినట్టు ఎన్ కౌంటర్ చేశారు. ఇదే దాడిలో వేలుపిళ్ళై ప్రభాకర్ అతని కుటుంబం అడవిలోని ఓ స్థావరంలో చిక్కటంతో శ్రీలంక సైనికులు వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. అనంతరం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి చనిపోయింది ప్రభాకరనే అంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎల్టీటీఈ ఇక లేదని చెప్పింది. కానీ సుమారు పద్నాలుగేళ్ళ తర్వాత ప్రభాకరన్ ప్రాణాలతో ఉన్నాడంటూ నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.