ఖైదీ సినిమాతో ఊహించని బ్లాక్ బస్టర్ ఇచ్చి విక్రమ్ సినిమాతో కోలీవుడ్ పై కాసుల వర్షం కురిపించి క్రేజీ డైరెక్టర్ గా మారాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఖైదీ సినిమాకూ విక్రమ్ సినిమాకు లింక్ పెట్టి లోకేష్ మల్టీవర్స్ అంటూ కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. తను చేసే సినిమాలన్నీ ఈ మల్డీవర్స్ కు సంబంధించినవే ఉంటాయనీ.. సిరీస్ రూపంలో సినిమాలు వస్తాయనీ చెప్పాడు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ తో లియో సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు లోకేష్ కశ్మీర్ లో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా చెన్నైలోనే షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్.. తాను త్వరలోనే సినిమాలు చేయటం ఆపేస్తానంటూ చేసిన కామెంట్ తమిళ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మల్టీ వర్స్ లో మొత్తం 10 సినిమాలు చేస్తాననీ.. 10 సినిమాలు పూర్తైన తర్వాత ఇక సినిమాలు చేయటం ఆపేస్తానంటూ లోకేష్ చేసిన కామెంట్లు అభిమానులకు పెద్ద షాకిచ్చాయి.
“మొదట షార్ట్ ఫిల్మ్స్ చేశాను.. ఆ తర్వాత సినిమాపై పట్టు దొరికిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాను.. ఈ ప్రయాణం ఎంతో పెద్దగా ఉండదు.. నేను శాశ్వతంగా సినిమాలు చేస్తూనే ఉండాలని కోరుకోవటం లేదు.. మల్టీవర్స్ లో 10 సినిమాలు వస్తాయేమో చూద్దాం.. 10 సినిమాల తర్వాత ఇండస్ట్రీలో ఉండాలని మాత్రం నేను కోరుకోవటం లేదు..” అంటూ లోకేష్ మాట్లాడాడు. లోకేష్ మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం లియో చేస్తున్న లోకేష్.. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు ఒప్పుకొని బిజీగా ఉన్నాడు. వచ్చే అక్టోబర్ లో విజయ్ లియో విడుదల చేస్తామని చెప్పారు. ఇక మిగతా సినిమాలు పూర్తయ్యే సరికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. తెలుగులో ప్రభాస్ తో కూడా లోకేష్ ఓ సినిమా ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి.. కానీ ఎంత వరకు నిజమో తెలియదు.