లిక్కర్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో తమిళనాడు డీఎంకే సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ను డోర్ డెలివరీ చేసే సరికొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే ఇందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా సందర్భానికి తగినట్టు ఆయా వేడుకల్లో మద్యం సేవించేందుకు అధికారికంగా అనుమతులు ఇచ్చే సరికొత్త లైసెన్స్ విధానం త్వరలోనే అమలు కాబోతోంది. ఎఫ్ఎల్ 12 అనే సరికొత్త లిక్కర్ లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా తమిళనాడు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ గత నెలలోనే జారీ చేయటం విశేషం.
ఇళ్ళలో లేదా క్లబ్ లేదా ఫంక్షన్ హాల్.. ఇలా ఏదైనా ఓ చోట పెళ్ళి లేదా మరేదైనా వేడుకలో మద్యం తాగేందుకు ఒకటి లేదా రెండు రోజులకు లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ తీసుకున్న వారికి ఆయా వేడుకల్లో అతిథులు సేవించటానికి మద్యం సరఫరా చేస్తారు. ఈ లైసెన్స్ కోసం వారం రోజుల ముందు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కొత్త వెబ్ సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా సరఫరా చేయాలనుకునే వారు ముందుగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి లైసెన్స్ వచ్చిన తర్వాత వారి వారి ఏరియాల్లో మద్యం సరఫరా చేసుకోవచ్చు. కమర్షియల్ ఈవెంట్ల కోసం అయితే కార్పోరేషన్లలో సంవత్సరానికి లక్ష రూపాయలు, మున్సిపాలిటీలలో 75 వేలు, ఇతర ప్రదేశాల్లో 50వేలు లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇక ఇళ్ళలో జరిగే ఫంక్షన్లకు లిక్కర్ సరఫరా చేయటానికి ఇచ్చే లైసెన్స్ ను నాన్ కమర్షియల్ లైసెన్స్ గా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ఒక్క రోజు లైసెన్స్ కోసం మున్సిపల్ కార్పోరేషన్లలో 11 వేలు, మున్సిపాలిటీలలో 7500, గ్రామాల్లో మరియు ఇతర ప్రాంతాల్లో 5 వేలు చెల్లించాలి. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం లిక్కర్ పై వచ్చే ఆదాయంపైనే ఎక్కువ శాతం ఆధారపడాల్సి వచ్చిన రాష్ట్రాలకు ఇదో మార్గదర్శకం లాంటిది. త్వరలోనే తమిళనాటు బాటలోనేే మరిన్ని రాష్ట్రాలు లిక్కర్ హోమ్ డెలివరీ విషయంలో కొత్త లిక్కర్ పాలసీలు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.