ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న లే ఆఫ్ ల సెగ ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ లింక్డ్ ఇన్ ను తాకింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి ఆఫర్ లెటర్ లు సంపాదించిన వాళ్ళతో పాటు కొత్తగా చేరిన వాళ్ళనూ.. కొంత మంది పాత వాళ్ళను కూడా ఉద్యోగాల నుంచి తొలగించింది. అయితే మొత్తం ఎంత మందిని తొలగించింది అనేది మాత్రం తెలియరాలేదు. లింక్డ్ ఇన్ అధికారికంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక మాంద్యం అంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారే తప్ప ఇప్పటి వరకూ ప్రపంచంలోని ఏ స్టాక్ మార్కెట్ లో కూడా నష్టాల జాడలు కనిపించలేదు. కానీ ముందస్తు భయాలతో కంపెనీలు ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించుకుంటున్నాయి.
ఇప్పటికే ప్రపంచ ఆన్ లైన్ దిగ్గజం అమేజాన్ అత్యధికంగా 10 వేల మందిని తొలగించింది. అంటే అమేజాన్ లో ఈ సంఖ్య 5 శాతానికి సమానం. ఫేస్ బుక్, ట్విటర్, గోల్డ్ మెన్ సాక్స్, యాహూ, గూగుల్ సహా.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలుగా పేరున్న కంపెనీలన్నీ లే ఆఫ్స్ పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. పెద్ద కంపెనీల ఎఫెక్ట్ తో చిన్న కంపెనీలు సైతం భవిష్యత్తులో ప్రాజెక్టులు ఉంటాయో లేదోనన్న ఆందోళనతో రిక్రూట్మెంట్ లను నిలిపివేయటంతో పాటు రిజర్వ్ బెంచ్ పై ఉన్న వాళ్ళను తొలగించేస్తున్నాయి. ఇప్పుడే ఉద్యోగాల తొలగింపు ఈ స్థాయిలో ఉంటే.. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టు ముడితే ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు.