తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్లు చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్ల విమర్శించటంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన పని మాత్రమేననీ.. దీని వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వచ్చిందనీ అన్నారు. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు. కమిషన్ లోనే పని చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేసిన ప్రవీణ్, రాజశేఖర్ అనే వ్యక్తులను తాము ఉపేక్షించేది లేదనీ.. సిట్ దర్యాప్తు పూర్తైన వెంటనే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. “తెలంగాణ ఉద్యమానికి పునాదే నీళ్ళు, నిధులు, నియామకాలు.. అలాంటిది నియామకాల విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోదు.. జరిగిన ఘటన పట్ల మాకు కూడా బాధగానే ఉంది..” అంటూ క్లారిటీ ఇచ్చారు కేటీఆర్.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్.. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి కమిషన్ రూపొందించిన ప్రశ్న పత్రాలను దొంగిలించి లీక్ చేశారు. దీంతో ఇప్పటికే జరిగిన ఏఈ, గ్రూప్-1 లాంటి పరీక్షలతో పాటు జరగాల్సిన అన్ని పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే మళ్ళీ కొత్త ప్రశ్న పత్రాలతో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ అధికారులు చెప్పారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. పరీక్షలు రాసిన వేలాది మంది పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనీ.. పేపర్ లీకేజీలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు టీఆర్ఎస్ మంత్రుల పాత్ర ఉందనీ విమర్శించారు. దీంతో కేటీఆర్ పై విధంగా ఘాటు సమాధానం చెప్పారు.