అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ఈసారి బీజేపీ జాతీయ అధిష్టానానికి బలమైన సవాల్ విసిరారు. తెలంగాణలో గత కొద్ది నెలలుగా ముందస్తు ఎన్నికల మాటలు వినిపిస్తున్న వేళ.. కేటీఆర్ దానిపై భిన్నమైన చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ రద్దు చేస్తే.. ఖచ్చితంగా మేం తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తామంటూ మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నిజామాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను కూడా కేటాయించలేదనీ.. తమ దగ్గర రూపాయి పన్ను రూపంలో తీసుకుంటే అందులో కేవలం 46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోందనీ.. ఇలాంటి సమయంలో కూడా తెలంగాణలో అభివృద్ధి ఆగలేదనీ అన్నారు.
నిజామాబాద్ జిల్లాకు బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదని పరోక్షంగా ఎంపీ అర్వింద్ పై విమర్శలు చేశారు. పసుపు బోర్డు సంగతి ఏమైందంటూ ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరే ఇతర రాష్ట్రంలోనూ జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పెండింగ్ లో ఉన్న పలు కార్యక్రమాలను, అభివృద్ధి పనులను కేసీఆర్ సర్కార్ వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది. అయితే.. ముందస్తు ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. తాము అసెంబ్లీని రద్దు చేయటం అనేది జరగదనీ.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పటి దాకా ప్రభుత్వం మనుగడలో ఉంటుందనీ చెప్పారు.