కొండా సురేఖ.. వరంగల్ జిల్లా లేడీ ఫైర్ బ్రాండ్. చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. దేనిమీదా పెద్దగా స్పందించకుండా ప్రస్తుతానికి మౌనంగా ఉంది ఈమె. టీపీసీసీ చీఫ్ పదవి కాంట్రవర్శీ నుంచి.. నిన్న కాక మొన్న జరిగిన కమిటీల వివాదం.. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వివాదాలపై కూడా కొండా సురేఖ పెద్దగా స్పందించలేదు. నామమాత్రంగానే వ్యవహరిస్తూ తనకేమీ పట్టనట్టుగానే వ్యవహరించిందే తప్ప వివాదాల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి కొండా సురేఖ.. ఒక్కసారిగా గేరు మార్చింది. తెలంగాణ కాంగ్రెస్ లో యేడాది కాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్రంగా స్పందించింది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదనీ.. ఉప ఎన్నికల్లో తమ్ముడి వైపు ప్రచారం చేసి కాంగ్రెస్ కు ద్రోహం చేసిన వెంకట్ రెడ్డితో కాంగ్రెస్ కు ఎలాంటి లాభం లేదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేసి టీపీసీసీలో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా కొత్తగా వచ్చిన మాణిక్యం థాక్రే ఏం చెప్పాడో.. ఏ మంత్రం వేశాడో తెలియదు గానీ.. ఇన్నాళ్ళు గాంధీ భవన్ కు దూరంగా ఉంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన వెంకట్ రెడ్డి.. ఎట్టకేలకు గాంధీ భవన్లో అడుగు పెట్టడమే కాకుండా రేవంత్ రెడ్డితో భేటీ కూడా అయ్యాడు. మొత్తానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య క్లాష్ తీరింది అనుకునే సమయంలో.. కొండా సురేఖ గేరు మార్చి రివర్స్ అటాక్ చేయటం టీపీసీసీలో మరో రచ్చకు కారణం అవుతోంది. అయితే.. ఈమె రేవంత్ రెడ్డికి మద్దతుగా ఇలా చేస్తోందా లేక వెంకట్ రెడ్డిపై వ్యతిరేకతతోనా.. ఈ రెండూ కాక కాంగ్రెస్ పార్టీపై మమకారంతోనా అన్న విషయం మాత్రం అర్థం కాలేదు.