ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు స్పీడు పెంచాయి. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయాలు, నియామకాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ చేతిలో పెట్టింది బీజేపీ జాతీయ అధిష్టానం. దీంతో తెలంగాణ పాలిటిక్స్ కాస్త హీటెక్కాయి. ఇక మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా జోరు మీదున్నది. ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. వీరిద్దరినీ పార్టీలోకి తీసుకోవటంలో రేవంత్ రెడ్డి ఆండ్ టీమ్ బాగానే కష్టపడింది. ఇక ఇప్పుడు మరో నేతను కాంగ్రెస్ లోకి లాగేయటానికి రేవంత్ టీమ్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడులో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత గూటికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి కలిసి రహస్యంగా చర్చలు జరిపారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకే రాజగోపాల్ రెడ్డి పొంగులేటిని కలిసినట్టు కార్యకర్తలు చెప్తున్నారు.
గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బహిరంగంగానే ఆయనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాడు రేవంత్ రెడ్డి. ఇక.. రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చాలా అసౌకర్యంగా ఉన్నారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు ఇప్పటికీ పక్క పార్టీ నాయకుడిగానే చూస్తున్నారట. తన కార్యకర్తలకు, స్థానిక బీజేపీ కార్యకర్తలకు ఏమాత్రం కమ్యూనికేషన్ సరిపోవటం లేదని ఆయన ప్రధాన అనుచరులు చెప్తున్నారట. తన సహచరులైన పొంగులేటి, జూపల్లి ఎలాగో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో.. తాను కూడా తన సొంత గూటికి వెళ్తేనే మంచిదని ఆయన భావిస్తున్నాడట. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇదివరకటి కంటే బలంగా మారిందనేది అంగీకరించాల్సిన నిజం.. ఇక తెలంగాణలో బీజేపీని బలహీనం చేసి.. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కీలక నేతలను కాంగ్రెస్ కు లాగేయాలనేది రేవంత్ రెడ్డి వ్యూహం పన్నుతున్నట్టు.. ఇందుకు వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా సాయం చేస్తున్నట్టు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. పరిస్థితులను బట్టి చూస్తే.. రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి వెళ్ళే రోజు దూరంలో లేదనే చెప్పాలి.