గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని జాతీయ అధిష్టానం మార్చేయనుందని వస్తున్న వార్తల పట్ల ఇప్పుడే ఓ స్పష్టత వచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ను తప్పిస్తారని వచ్చిన వార్త నిజమేనని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
తెలంగాణ బీజేపీ కార్యాలయం నుంచి కాసేపట్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి విషయంలో మాత్రమే కాకుండా తెలంగాణ బీజేపీలో చాలా పెద్ద మార్పులే చేస్తూ జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈటెల రాజేందర్ కు తెలంగాణ చేరికల కమిటీ అధ్యక్ష పదవితో పాటు పార్టీలో మరో కీలక పదవి ఇచ్చారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న జాతీయ బీజేపీ అధిష్టానం 5 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజును తొలగించి పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల అధ్యక్షులను మార్చేసి కొత్త వాళ్ళను నియమించింది జాతీయ అధిష్టానం. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ చాలా మార్పులే చేసినట్టు తెలుస్తోంది. నాక్కూడా పార్టీ పదవి ఇస్తే తప్పేమిటని అడిగిన రఘునందన్ రావు విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది.