అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ను ఓ భారత సంతత వ్యక్తి ట్రక్ తో ఢీకొట్టడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆ వ్యక్తి పేరు సాయి వర్షిత్ అనీ.. 19 సంవత్సరాల ఈ యువకుడు వైట్ హౌజ్ లోకి ప్రవేశించి వీలైతే బైడెన్ ను చంపేయాలనీ.. లేకపోతే ఎవరు కనిపిస్తే వారిని గాయపరచాలనే లక్ష్యంగా పెట్టుకొని ట్రక్కుతో వైట్ హౌజ్ సెక్యూరిటీ వాల్ ను ట్రక్కుతో ఢీ కొట్టాడని పోలీసులు చెప్తున్నారు. ఘటన జరిగిన వెంటనే సాయి వర్షిత్ ను అదుపులోకి తీసుకున్న అమెరికన్ పోలీసులు అతడిని విచారించగా ఆ యువకుడు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాలని పోలీసులు చెప్తున్నారు. బైడెన్ ను హత్య చేయటం కోసం ఆరు నెలల నుంచి ప్లాన్ చేస్తున్నానని ఆ యువకుడు అంగీకరించాడట. అందుకోసమే అద్దెకు తీసుకొచ్చిన ట్రక్ తో వైట్ హౌజ్ సెక్యూరిటీ వాల్ ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి బైడెన్ ను హత్య చేసి అమెరికా అధ్యక్ష పదవి సొంతం చేసుకోవాలని అతడు ప్లాన్ చేశాడంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే.. యువకుడు చెప్తున్నాడంటూ పోలీసులు వెల్లడించిన వివరాలు అనుమానాస్ఫదంగా అనిపిస్తున్నాయి.
2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన సాయి వర్షిత్.. ప్రోగ్రామింగ్ మరియు కోడింగ్ లో నైపుణ్యం కలిగి ఉన్న యువకుడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇటువంటి యువకుడు ఉన్నట్టుండి అమెరికా అధ్యక్షుడినే చంపేయాలని నిర్ణయించుకోవటం ఏమిటనేది అర్థం కాని విషయం. మరో విషయం ఏమిటంటే.. పోలీసులు అరెస్టు చేసిన సమయంలో అతడి వద్ద జర్మన్ కు చెందిన నాజీ జెండా ఉందని పోలీసులు చెప్తున్నారు. అంతే కాకుండా ‘నాజీలు గొప్ప చరిత్ర ఉన్న వారు’ అంటూ ఆ యువకుడు వాదిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. అమెరికాలో ఎక్కడా దొరకని నాజీ జెండా ఆ యువకుడు ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం..? ఎవరికీ దొరకని జెండా ఆన్ లైన్లో ఆ యువకుడికి మాత్రమే ఎలా దొరికింది అనేది అర్థం కాని విషయం. హిట్లర్ చరిత్ర ఆన్ లైన్లో పుస్తకాలు చదివి తెలుసుకొని ఉండవచ్చు.. అంత మాత్రానికే అమెరికా అధ్యక్షుడిని చంపేయాలన్నంత కోరిక ఆ యువకుడికి ఎందుకు కలుగుతుంది..? ప్రపంచ యుద్ధాలు, వాటి నేపథ్యాలు.. ఆ యుద్ధాల్లో జర్మనీ మరియు హిట్లర్ పాత్ర.. ఇవన్నింటితో పాటు వీటికీ అమెరికాకు మధ్య ఉన్న సంబంధం.. ఇన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేస్తే గానీ చరిత్ర అర్థం కాదు. మరి కేవలం 19 సంవత్సరాల యువకుడు తన సబ్జెక్టులన్నీ వదిలిపెట్టి హిస్టరీ చదవాలని ఎందుకు అనుకున్నాడు అనేది మరో ప్రశ్న. అమెరికా వ్యతిరేక భావజాలాన్ని బలంగా ఎక్కిచ్చి ఎవరో ఈ యువకుడిని ఎరగా వేసినట్టు కనిపిస్తోందని పలువురి అభిప్రాయం. వైట్ హౌజ్ సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉంటుందో కనీస అవగాహన లేకుండా కేవలం ట్రక్కుతో ఢీకొట్టి వైట్ హౌజ్ గోడలు బద్దలు కొట్టి.. బైడెన్ దగ్గరకు వెళ్ళి.. అతడిని చంపేయటం అనేది ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా..? ప్రపంచంలోకెల్లా అత్యంత సెక్యూరిటీని కలిగి ఉంటే వైట్ హౌజ్ లో బైడెన్ ను చంపటం అనేది కేవలం కలలో లేదా సినిమాలో మాత్రమే సాధ్యం తప్ప నిజజీవితంలో కాదు. మరి ఈ మాత్రం తెలియకుండా బైడెన్ ను చంపేయటానికి వచ్చిన ఆ యువకుడు.. అయితే పిచ్చి వాడు అయ్యుండాలి.. లేదంటే పాపులారిటీ కోసం డ్రామా ఆడి ఉండాలి.. రెండూ కాకపోతే ఎవరో కావాలని సగం సగం మాటలు చెప్పి చేయించి ఉండాలి..! అంతే..!! లేకపోతే బైడెన్ ను చంపేసిన వాడి చేతికి అమెరికా అధ్యక్ష పదవి వస్తుందా..!?