ఖలిస్తాన్ తిరుగుబాటు నాయకుడు, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ అయిన హర్ దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. ఖలిస్తాన్ వేర్పాటు నేతలకు కావాల్సిన ఆర్ధిక సహాయంతో పాటు నెట్ వర్క్ ఏర్పాటు చేయటం వంటి రహస్య కార్యకలాపాలకు హర్ దీప్ సింగ్ సాయం చేస్తుంటాడు. సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా హర్ దీప్ సింగ్ నిజ్జర్ కు దగ్గరి సంబంధాలున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతుదారులను కూడ గట్టడం.. ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని వ్యాప్తి చేయటంతో పాటు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు ఈ హర్ దీప్ సింగ్. సోషల్ మీడియా ద్వారా భారత వ్యతిరేక మరియు ఖలిస్తాన్ భావజాలాన్ని వ్యాప్తి చేయటంతో పాటు అమాయక సిక్కులను రెచ్చగొట్టి ఖలిస్తాన్ వేర్పాటు వాదానికి మద్దతిచ్చేలా వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళను కూడా ఖలిస్తాన్ ఉద్యమంలోకి లాగటమే ఇతడి ముఖ్యమైన పని.
ఇతడి ఫేస్ బుక్ మరియు ఇతర అకౌంట్లలో రెచ్చగొట్టే ఉపన్యాసాల వీడియోలు, ఇతర పోస్టులను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే హర్ దీప్ పై భారత్ లో అనేక కేసులు నమోదయ్యాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఇతడనిపై కేసులు నమోదు చేసి రెడ్ కార్నర్ జారీ చేసింది. పంజాబ్ లో కూడా ఇతడిపై అనేక కేసులు ఉన్నాయి. భారత్ కు అప్పగించాల్సిన నేరస్తుల జాబితాలో భారత్ ఇతడి పేరు కూడా చేర్చి 2018లోనే కెనడా ప్రభుత్వానికి అందజేసింది. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన హర్ దీప్ సింగ్ నిజ్జర్.. కెనడాలో ఆశ్రయం పొంది అక్కడ గల ఖలిస్తాన్ మద్దతుదారులను కూడగట్టే పని చేస్తున్నాడు. అయితే.. ఎవరూ ఊహించని రీతిలో గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వారాలోనే ఇతడిని కాల్చి చంపడం సంచలనంగా మారింది. మరో వైపు ఖలిస్తాన్ లిబరేషన్ టైగర్స్ సంస్థ నేత అవతార్ సింగ్ ఖాండా కూడా బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించాడు. వారిస్ దే పంజాబ్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకోటానికి సహాయం చేసింది ఇతడే. ఖలిస్తాన్ మద్దతుదారుల్లో ఇద్దరు కీలక వ్యక్తులు యాధృచ్ఛికంగా ఒకే రోజు మరణించారు.