ఖమ్మంలో జరుగుతున్న భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించే ఆలోచనతో జాతీయ కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ తో కలిసి వెళ్ళేందుకు నిర్ణయించుకున్న విజయన్.. కేసీఆర్ ను.. ఆయన రాజకీయాన్ని ఆకాశానికెత్తేశాడు. ఖమ్మం సభలో మొదటి ప్రసంగం చేసిన విజయన్.. కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా తాను చూడలేదన్నారు. కంటి వెగులు కార్యక్రమం నిజంగా ఓ అద్భుత పథకమనీ.. ఈ ఆలోచనే ఏ ముఖ్యమంత్రికీ రాలేదన్నారు.
ఇదే సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ పార్టీపై కూడా విజయన్ విమర్శలు చేశారు. దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో ఉన్నదనీ.. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు బీజేపీని ఓడించటం ఒక్కటే మార్గమని చెప్పారు. అలాగే గవర్నర్ వ్యవస్థ గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేసేందుకే గవర్నర్ వ్యవస్థ ఉన్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయమన్నారు. మొత్తానికి కేసీఆర్ కు తన మద్దతు ఉన్నదన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు.