మహారాష్ట్ర రాజకీయం మరోసారి రసవత్తరంగా మారుతోంది. మరో 20 రోజుల్లో షిండే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం తథ్యమంటూ శివసేన(థాక్రే) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్ళిపోయి బీజేపీతో కలిపి షిండే ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందంటూ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంత ఆషామాషీగా వచ్చినవి కావని రాజకీయ విశ్లేషకుల అంచనా. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వం అయిన మహా వికాస్ అఘాడీ కొద్ది నెలల క్రితం కూలిపోయిన విషయం తెలిసిందే. థాక్రే పట్ల అసంతృప్తితో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అయితే.. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే మహారాష్ట్రలో మళ్ళీ రాజకీయ అనిశ్చితి ఏర్పడినట్టే. ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ కు కలగనున్న అనుకోని అవకాశమనే చెప్పాలి.
థాక్రే శివసేన పార్టీపై తిరుగుబాటు చేసి షిండేకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ థాక్రే వర్గంలోకి చేరనున్నారని తెలుస్తోంది. దీనికి కారణం.. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడబోతోందనే వార్తలే. థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ థాక్రే వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారిస్తున్న కోర్టు ఏ క్షణంలోనైనా 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనుందనే వార్త మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదే జరిగితే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అన్ని పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం కనుక పడిపోయినట్టైతే.. గవర్నర్ అన్ని పార్టీలను బల నిరూపణ కోసం పిలుస్తుందనే నమ్మకం లేదు. గవర్నర్ పాలన లేదా మళ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చు అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు కనుక మహారాష్ట్రలో జరిగితే బీఆర్ఎస్ కు భారీ శుభవార్త అనే చెప్పాలి.
ఇటీవలి కాలంలో కర్ణాటకను పక్కన పెట్టిన కేసీఆర్.. మహారాష్ట్రపైనే ఫోకస్ చేస్తున్నారు. బహుషా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై గులాబీ బాస్ కు పూర్తి సమాచారం ఉన్నట్టు కనిపిస్తోంది. ఏ క్షణమైనా ప్రభుత్వం కూలిపోవచ్చనే రాజకీయ విశ్లేషకుల అంచనాల వల్లనే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై గట్టి ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నిన్న ఔరంగబాద్ లో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం సంఖ్యను చూస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపించక మానదు. అసలు ఉనికిలోనే లేని బీఆర్ఎస్ పార్టీ సభకు అంత మంది జనం హాజరు కావటం.. వివిధ పార్టీల నుంచి చాలా మంది యువకులు, అనుభవజ్ఞులు బీఆర్ఎస్ కండువా కప్పుకుంటూ పార్టీలో చేరటం.. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ఉందని నమ్మక తప్పదు. తెలంగాణకు సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల సొంత పార్టీ అనే ఫీలింగ్ రప్పించటం.. అలాగే స్థిరత్వం లేని ప్రభుత్వాలను నడిపే పార్టీలపై అసహ్యం కలిగేలా చేయటం.. అలాగే తెలంగాణ అభివృద్ధిని చూపించి బీఆర్ఎస్ పార్టీ పట్ల మంచి అభిప్రాయం వచ్చేలా చేయటం.. ఇవన్నీ కేసీఆర్ సభల వెనుక ఉద్దేశ్యాలు అయి ఉండవచ్చు. వాళ్ళూ వాళ్ళూ కొట్టుకు చస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వటం కొత్త ప్రత్యామ్నాయం మేమే అని చెప్పకనే చెప్పటం అన్నమాట.
ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ ఎన్నికలు కనుక వస్తే.. కేసీఆర్ ముందు ఓ అద్బుతమైన అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే పని కనుక కేసీఆర్ తన భుజాలపై వేసుకుంటే.. ఖచ్చితంగా ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యే అవకాశాలు లేకపోలేదు. మహారాష్ట్రలో తరచూ ప్రభుత్వాలు కూలిపోవటానికి కారణం కేవలం బీజేపీయే అనేది గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే బీజేపీ వ్యతిరేక కూటమికి భారీ బలం చేకూరినట్టే. అన్ని అనుకున్నట్టు జరిగి బీఆర్ఎస్ కూటమి మహారాష్ట్రలో విజయం సాధిస్తే.. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడానికి కేసీఆర్ కు అతిపెద్ద అవకాశం దొరికినట్టే. సో.. మహారాష్ట్రలో మళ్ళీ ఎన్నికలు వస్తే గులాబీ బాస్ ముందున్న లక్ష్యం ఇదే అయి ఉండవచ్చు. మహారాష్ట్రలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించటం వెనుక సీక్రెట్ కూడా ఇదే కావచ్చు. ఏ రాజకీయం ఎటు తిరిగి ఎక్కడ ఆగనుందో.. ఏం జరగనుందో.. ఎదురు చూడక తప్పదు.