తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కోసం ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 17 న ఆయన 69వ పుట్టిన రోజును భారీగా సెలబ్రేట్ చేయటంతో పాటు ఆయనకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు 69 కిలోల కేక్ ను సిద్ధం చేశారు. కేక్ తో పాటు పలు ఆసక్తికరమైన బహుమతులు ఆయన పుట్టిన రోజు కోసం సిద్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను వివరిస్తూ 3డీ యానిమేషన్స్ తో ఓ వీడియోను కూడా సిద్ధం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొననున్నారు.
కేసీఆర్ పుట్టిన రోజున ఆయన క్షేమాన్ని కోరుకుంటూ తెలంగాణలోని పలు దేవాలయాల్లో చండీయాగం, ఆయుష్ హోమం, రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. అంతే కాకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పలు క్రీడా టోర్నమెంట్లలో విజేతలను ప్రకటించి ఇదే రోజున వారికి బహుమతులు అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేయటంతో తెలంగాణ మొత్తం సందడి వాతావరణం కనిపిస్తోంది.