తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గోడౌన్స్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సాయిచంద్ హఠాన్మరణం పట్ల తెలంగాణ యావత్ ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ తో పాటు ఉద్యమించిన పలువురు గాయకులు, కళాకారులు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున సాయి చంద్ ఇంటికి పయనమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా అగ్రనేతలంతా సాయి చంద్ పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్ళారు. సాయి చంద్ భార్య, కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్ భార్య కేసీఆర్ కాళ్ళపై పడి బోరున విలపించటం అక్కడున్న వారిని, చూసే వారినే కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కదిలించింది. సాయి చంద్ భార్య దీన స్థితిని చూసిన కేసీఆర్ కంట తడి పెట్టుకున్నారు. ఆయన భార్యను, తండ్రిని ఓదార్చిన కేసీఆర్.. నేనున్నానంటూ వాళ్ళకు ధైర్యం చెప్పారు.
సాయి చంద్ మృతిపై స్పందించిన మంత్రి కేటీఆర్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన గురించి మాట్లాడుతూ గతాన్ని గుర్తుకు చేసుకున్న కేటీఆర్.. ఎమోషనల్ అయిపోయి కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకున్నారు. సాయి చంద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు అతడి గురించి గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. సాయి చంద్ తెలంగాణ ఉద్యమ గొంతుక అనీ… ఆయన మరణించినా ఆయన పాటకు మాత్రం మరణం లేదనీ హరీష్ రావు వ్యాఖ్యానించారు. యువకుడైన సాయి చంద్ హఠాన్మరణంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నింపింది. నాగర్ కర్నూల్ లోని కారుకొండ ఫామ్ హౌజ్ లో ఉన్న సాయి చంద్ కు ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చింది. వెెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోని హాస్పిటల్ కు తరలించగా.. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో చికిత్స తీసుకుంటూ సాయి చంద్ ప్రాణాలు విడిచారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.