కార్తికేయ 2 సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఓ భారీ హిందూ ఉద్యమాన్ని సృష్టించినంత పని చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ హిందూ సంస్కృతిని, ఆచారాలను పక్కన పెట్టడంతో తెలుగు సినిమాను పోల్చుతూ చాలా మంది బాలీవుడ్ పై విమర్శలు చేశారు. హిందీ ప్రేక్షకులు సైతం కార్తికేయ 2 చూసి ఫిదా అయిపోయి.. సౌత్ ఇండియన్ సినిమాలపై దృష్టి పెట్టారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ పేరు అయితే మార్మోగిపోయింది. కలెక్షన్ల విషయంలో కార్తికేయ 2 సునామీని సృష్టించింది. పెట్టిన పెట్టుబడికి 20 రెట్లు కలెక్షన్లు వసూలు చేసి పెట్టింది. అయితే కార్తికేయ 2 క్లైమాక్స్ లోనే కార్తికేయ 3 ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్ కు బాలీవుడ్ నుంచి తెగ ఆఫర్లు వచ్చేస్తున్నాయి.
కార్తికేయ 3 కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయటానికైనా మేం రెడీ అంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అభిషేక్ అగర్వాల్ కు ఆఫర్లు ఇస్తున్నారట. ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎంతైనా ఇవ్వటానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ కార్తికేయ మేకర్స్ మాత్రం ఈ సినిమా నిర్మాణ విషయంలో ఎవరినీ ఇన్వాల్స్ చేసే ఉద్దేశం లేదని చెప్తోందట. కావాల్సిన ప్రొడక్షన్ కాస్ట్ తామే చూసుకోగలమంటూ చెప్తున్నారట. అయితే కార్తికేయ 3 ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం నిఖిల్ స్పై సినిమాతో బిజీగా ఉండగా.. కార్తికేయ 3 కోసం కావాల్సిన స్క్రిప్టు ఇంకా పూర్తి కాలేదు. స్క్రిప్ట్ పూర్తై ఆ తర్వాత అన్నీ కుదిరి పిక్చరైజేషన్ మొదలు పెట్టాలంటే కనీసం రెండేళ్ళ సమయం పడుతుందని అంచనా.