కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే కష్టాలు మొదలైనట్టు కనిపిస్తున్నది. గెలిచి ముచ్చటగా మూడు నెలలైనా కాకముందే కర్ణాటక పాలకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాలైన గ్యారంటీ హామీలు.. సిద్దరామయ్య ప్రభుత్వం మెడకు ఉరి తాడే బిగుస్తున్నాయి. తాజాగా.. అన్నభాగ్య పథకం ద్వారా ప్రజలకు అందజేయాల్సిన బియ్యం విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలకు సరిపడా పంపిణీ చేసేందుకు బియ్యం సేకరించే ప్రయత్నాలు చేయగా.. అందుకు కావాల్సినంత మోతాదులో బియ్యం దొరకటం లేదు. దీంతో బియ్యం బదులు కిలోకు 34 రూపాయల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లో వేస్తామంటూ పథకంలో మార్పులు తీసుకొచ్చింది సిద్దరామయ్య సర్కార్. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి కిలోకు 34 రూపాయల చొప్పున డబ్బులు బ్యాంకు ఖాతాలో ప్రతీ నెలా జమ చేస్తామని చెప్తున్నాడు సీఎం సిద్దరామయ్య.
అన్నభాగ్య పథకం సంగతి పక్కనపెడితే మిగతా గ్యారంటీ పథకాలు కూడా కర్ణాటక సర్కార్ కు గుదిబండలా పరిణమిస్తున్నాయి. పెళ్ళి అయిన ప్రతి మహిళకు ప్రతీ నెలా 2 వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తీరా చూస్తే ఇది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ కు. ప్రతి నెలా కోట్లాది రూపాయలు ఇస్తూ పోతే ఆరు నెలల్లో కర్ణాటక దివాలా తీయటమే. ఐదేళ్ళలో కర్ణాటక అప్పుల కుప్పగా మారటం ఖాయం. ఇక రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు విషయంలో కర్ణాటక ప్రజల కక్కుర్తి మామూలుగా లేదు. ఎన్ని యూనిట్లు వాడినా సరే కరెంటు బిల్లు మాత్రం కట్టేదే లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు జనం. బిల్లు వసూలు చేసేందుకు కరెంటు అధికారులు జనం ఇళ్ళకు వెళ్తే ఏకంగా చెప్పులతో కొట్టేస్తున్నారు. ప్రతీ మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్.. మరీ దారుణం. ఎక్కడ ఏ బస్సు కనిపిస్తే ఆ బస్సు ఎక్కేస్తున్నారు.. దిగమంటే డ్రైవర్లను చితకబాదుతున్నారు కర్ణాటక మహిళలు. కేవలం గ్యారంటీ పథకాల హామీల వల్లనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం సంపాదించిందనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావటానికి దోహదం చేసిన అవే పథకాలు ఇప్పుడు ప్రభుత్వం పాలిట శాపంగా మారాయి.
ఉచితాలు దేశాన్ని నాశనం చేస్తాయనీ.. ఎన్నికల వేళ ఉచితాల హామీలు ఇవ్వటం సరికాదనీ బీజేపీ సర్కార్ నొక్కి చెప్తే.. లోకల్ పార్టీలు బీజేపీపై మండి పడ్డాయి. రైతులకు ఫ్రీ కరెంటు, విద్యార్థులకు ఫీజు రీఅంబర్స్ మెంట్.. ఇలాంటివైతే మంచిదే.. కానీ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం.. మీరు ఇంట్లో కూర్చొండి అని చెప్పటం ఎంత తప్పో కర్ణాటక సీన్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. జనానికి విద్య, వైద్యంలాంటివి ఫ్రీగా ఇవ్వాలి.. అది ప్రభుత్వం బాధ్యత..! కానీ నెలకు 2 వేలు ఖర్చులకు ఇచ్చేస్తాం.. కరెంటు బిల్లు మాఫీ చేసేస్తాం.. బస్సులో ఫ్రీగా తిప్పేస్తామని చెప్తే ఇలాగే ఉంటుంది. ఏది ఏమైనా.. గ్యారంటీ హామీల ఎఫెక్ట్ ఇప్పుడే మొదలైంది సిద్దరామయ్య సర్కార్ కు.. రాను రాను ఇది కాంగ్రెస్ ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.