నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అమిగోస్ నుంచి కొత్త సాంగ్ ప్రోమో విడుదలైంది. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ధర్మక్షేత్రంలోని పాపులర్ సాంగ్.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ అనే పాట అమిగో కోసం రీమిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ప్రోమోలో ఫస్ట్ పాత పాటలోని ఒరిజినల్ గొంతులతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉంచి ఉన్నది ఉన్నట్టే పెట్టారు. రిపీట్ లో మాత్రం ఈసారి ఎస్పీ చరణ్ వాయిస్, సమీరా భరద్వాజ్ గొంతులతో మళ్ళీ ఎన్నో రాత్రులొస్తాయి గానీ అంటూ మొదలైంది. పాత పాటను రీమిక్స్ చేయటంలో ఇది నిజంగానే కొత్తగా అనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఎస్పీ బాలు గొంతును ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ గొంతులు ఒకే సారి వినొచ్చు. కానీ తేడా కనిపెట్టడం చాలా కష్టమనే చెప్పాలి.
కొద్ది నిముషాల క్రితమే యూట్యూబ్ లోకి వచ్చిన ఈ పాట అప్పుడే దూసుకెళ్తోంది. బాబాయ్ పాటను రీమిక్స్ చేసిన అబ్బాయి అంటూ సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమిగోస్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురు ఎవరు.. ఎందుకు ఒకేలా ఉన్నారు.. అసలేంజరిగిందనేదే కథ. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. మొత్తానికి అమిగోస్ అప్డేట్ అదిరిపోయింది.