నందమూరి నట వారసుడు వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసుడిగా మారబోతున్నాడా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేయనున్నాడా.. అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. ప్రస్తుతం నారా వారి వారసుడు లోకేష్ ఏపీలోని 125 నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేపు కుప్పం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ఈ యాత్రలో నందమూరి కుటుంబం నుంచి మరో కుర్రోడు కూడా పాల్గొనబోతున్నాడు. అతడెవరో కాదు.. నందమూరి తారకరత్న. కొద్ది రోజులుగా పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనిపిస్తున్న తారకరత్న.. లేటెస్ట్ గా 2024 ఎన్నికల గురించి ఓ ట్వీట్ చేశాడు.
2024లో టైగర్ వచ్చేస్తోంది.. అంటూ ఇన్ డైరెక్ట్ గా జూనియర్ రంగప్రవేశం గురించి చెప్పాడన్నమాట. అంతకు ముందే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసినప్పటికీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడన్నమాట. నందమూరి నటసింహం ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే బ్లాక్ బస్టర్ సినిమాలు.. బ్లాక్ బస్టర్ షో లూ చేస్తూ దూసుకెళ్తున్నాడు. మూడో తరం వారసుడు ఎన్టీఆర్ కూడా బాబాయ్ లాగానే డబుల్ రోల్ ప్లే చేయబోతున్నాడేమో. ఏది ఏమైనా.. కష్టాల్లో ఉన్న తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్ రాక కొండంత బలం ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.