మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించాలని కోరుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఆస్కార్ అకాడమీ షాకిచ్చింది. ఆస్కార్ వేదికపై యుద్ధం గురి మాట్లాడటానికి ఆస్కార్ అకాడమీ అనుమతి నిరాకరించింది. అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ మీడియా ప్రతినిథులు అకాడమీ ప్రతినిథులను ప్రశ్నించగా.. వారు సమాధానమిచ్చేందుకు తిరస్కరించడం గమనార్హం. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టిన తర్వాత తనకు అవకాశం వచ్చిన ప్రతి అంతర్డాతీయ వేదికపైనా జెలెన్ స్కీ ప్రసంగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రష్యా తమ దేశంపై దండయాత్ర చేస్తోందనీ.. తమ దేశానికి సహాయం కావాలని అడిగేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 2 నెలల క్రితం జరిగిన గ్రామీ అవార్డు వేదికపై కూడా జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించాడు.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి యేడాది పూర్తయ్యింది. ఇప్పటికీ విజయం ఇరుపక్షాలకు చిక్కకుండానే ఉంది. అమెరికా, యూరప్ సహా నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ కు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తుండటంతో ఇప్పటి వరకూ ఉక్రెయిన్ పై రష్యా పూర్తి విజయాన్ని సాధించలేకపోయింది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు భారీ సాయం అందించిన ఆయా దేశాలు కూడా ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోయాయి. అమెరికా ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు వెనుకడుగు వేస్తున్న క్రమంలో ఆస్కార్ వేదికపై ప్రసంగించేందుకు అకాడమీ అనుమతి నిరాకరించటం చర్చనీయాంశంగా మారింది.