జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనతో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. పవన్ ను చూడటానికి ఫ్యాన్స్ భారీ ఎత్తున కొండగట్టు చేరుకోవటంతో కొండగట్టు జనసంద్రమైంది. పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో బస్సు యాత్ర నిర్వహించటానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ బస్సు యాత్ర కోసమే పవన్ ప్రత్యేకమైన బస్సును తయారు చేయించుకున్నాడు. ఆర్మీ వ్యాన్ ను పోలిన ఈ బస్సు పేరు వారాహి అని పెట్టుకున్న పవన్.. తన వాహనానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేయించటానికి ఈ రోజు తెలంగాణలో అడుగు పెట్టాడు. పవన్ రాకతో తెలంగాణ జనసేన పార్టీ కార్యకర్తలు భారీ హంగామా చేస్తున్నారు.
కొండగట్టు తర్వాత ధర్మపురి క్షేత్రాన్ని కూడా పవన్ సందర్శించనున్నాడు. బస్సుయాత్రకు ముందు పవన్ కళ్యాణ్ పలు నరసింహ క్రేత్రాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాడట. అలాగే తాను వెళ్ళిన ప్రతి చోటా జనసేన కార్యకర్తలతో సమావేశం జరిపి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తాడని తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎప్పుడు బస్సు యాత్ర చేయబోతున్నాడనేది మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు.