భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరికొన్ని గంటల్లో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమవుతోంది. అచ్చొచ్చిన వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) ద్వారా డి-2 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపేందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. మరో 20 గంటల్లో శాస్త్రవేత్తలు తొలి ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ప్రయోగ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఇవాళ సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ నమూనాను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే శుక్రవారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు షార్ లో మొదటి ప్రయోగ వేదిక నుంచి చిన్న ఉప గ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లు పరిశీలన, పర్యవేక్షణ కోసం ఇస్రో అధిపతి డా. డాక్టర్ సోమనాథ్ నిన్న షార్ కి చేరుకున్నారు. ప్రయోగ వేదికలోని వాహకనౌకను పరిశీలించి శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు
ఎస్ఎస్ఎల్వి -డీ 2 వాహకనౌక ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవో ఎస్-07 ఉపగ్రహం తోపాటు… యూఎస్ఏలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువుగల జానూస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను కక్ష్యలోకి మోసు కెళ్లనుంది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన 15 నిమిషాల వ్యవధిలో మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఈవోఎస్-07కు 785 సెకన్లు, జానుస్-1 880 సెకన్లు, ఆజాదీశాట్ 900 సెకన్ల సమయం పట్టనుంది.
ఎస్ఎస్ఎల్వి డి-2 రాకెట్ ప్రయోగ నేపథ్యంలో షార్ లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల నుంచి పలువురు శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు, ప్రముఖులు ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో షార్ మొత్తం సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు అధీనంలోకి తీసుకుంది. ఉపరితలం, సముద్ర మార్గంతో సహా అన్ని ప్రాంతాలలో భద్రతాధికారులు అనువణువును జల్లెడ పడుతున్నారు.పూర్తిస్థాయిలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలలో అనుమానితులు, ఇతరులు కనిపించినా వారిని అదుపులోకి తీసుకొని విచారించి పంపుతున్నారు.