ఉక్రెయిన్-రష్యా యుద్ధం భీకరంగా కొనసాగుతుండగానే ప్రపంచం ముందు మరో వార్‌సైరన్ మోగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఎప్పట్నుంచో ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు దాడులు, వార్నింగ్‌ల వరకూ వెళ్లాయి. ఇరాన్ క్షిపణి స్థావరమే లక్ష్యంగా మూడు డ్రోన్లు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడి ఇజ్రాయెల్ నిఘా సంస్థ పనే అంటూ ఇరాన్ యాక్షన్‌లోకి దిగిపోయింది. దాడికి ప్రతి దాడి తప్పదని హెచ్చరికలు చేస్తోంది. ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం ఒక్క బుల్లెట్‌తోనే మొదలవుతుంది. అలాంటి పరిస్థితులనే గతేడాది ఫిబ్రవరి 24న ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు మరోసారి అదే ఫిబ్రవరి ఇంకో యుద్ధా న్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇస్ఫహాన్.. ఈ సిటీ ఇరాన్‌కు అత్యంత కీలకమైన నగరం. ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్మీకి ఆయుధాలు అందించే కీలక క్షిపణి కేంద్రాలున్నాయి. ఈ దాడి విజువల్స్ కూడా అలాంటి క్షిపణి కేంద్రాలపై జరిగినప్పుడు క్యాప్చర్ చేసినవే. ఈ నగరంలో ఏం జరుగుతుం దో.. ఇరాన్ సర్కార్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందో సొంత ప్రజలకే తెలీదు. అలాంటిది బయటి నుంచి మూడు డ్రోన్లు నగరంలోకి వచ్చి ఎంచుకున్న పాయింట్లపై బాంబులు విడిచి విధ్వంసం సృస్టించాయి అంటే.. ఇది పూర్తిగా తెలిసిన బయటివారిపనే అయి ఉండాలి. ఇస్ఫహాన్‌లో ఇరాన్ యాక్షనేంటో పూర్తిగా తెలిసింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కే. ఈ విషయం ఇరాన్‌కు కూడా తెలుసు. అందుకే, ఈ దాడి జరిగిన తర్వాత పూర్తి వివరాలు బయటకు చెప్పని ఇరాన్ సర్కార్.. ఇస్ఫహాన్‌లో దాడికి మూడు డ్రోన్లు వస్తే.. రెండింటిని కూల్చివేశామని మాత్రమే చెప్పింది. అయితే, ఆ మూడు డ్రోన్లు ఎందుకొచ్చాయో.. అవి ఏ లక్ష్యంతో దాడులకు దిగాయో ఇరాన్‌కు పూర్తిగా తెలుసు. కానీ, దాడులపై మాత్రం తేలుకుట్టిన దొంగలా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇస్ఫహాన్‌లో తమ యాక్షన్ బయటి ప్రపంచానికి తెలియకూడదని ఇరాన్ భావించింది కాబట్టే ఇరాన్ సైలెంట్‌గా ఉండిపోయింది.
నిజానికి.. ఇస్ఫహాన్‌లో రెండు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు క్షిపణి సాంకేతికతకు సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయని లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ పేర్కొంది. వీటన్నింటికీమించి అణు ప్రయోగ ల్యాబ్‌లకు ఇస్ఫహాన్ సిటీ కేరాఫ్ అడ్రస్. ఈ నగరంలో నాలుగు అణు ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల దాడి జరిగిన ప్రదేశంలో ఇరాన్ ఓ హైపర్‌సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేసిందని ఇజ్రాయెల్ కూడా ఆరోపణలు చేస్తోంది. తాజాగా దాడి జరిగిన ప్రదేశం ఇరాన్ హైపర్ సోనిక్ క్షిపణి అభివృద్ధి కేంద్రం కావొచ్చని మొస్సాద్ మాజీ చీఫ్ డానీ యాటమ్ ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోలో చెప్పారు. ఇరాన్ వద్ద దాదాపు 3వేల వరకూ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని.. వీటిల్లో కొన్ని టెల్ అవీవ్‌ను కూడా చేరుకోగలవని యాటమ్ తెలిపారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ దగ్గర ఇస్ఫహాన్ గురించిన సీక్రెట్స్ అన్నీ ఉన్నాయనేందుకు ఈయన మాటలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇరాన్ అభివృద్ధి చేసిన ఆయుధాలను యుద్ధ కల్లోలిత దేశాలు సిరియా, పాలస్తీనా, లెబనాన్‌కు సరఫరా చేస్తోందని, అందుకే క్షిపణి కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేస్తోందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఇస్ఫహాన్‌లో దాడులపై మొదట సైలెంట్‌గా ఉన్న ఇరాన్.. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ను కార్నర్ చేయడం మొదలుపెట్టింది. తమ భూభాగంలో ఉన్న ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపించింది. తాజాగా.. ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో ఇజ్రాయెల్ దాడిపై ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని లేఖలో చెప్పింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో ఆర్మీ ఆయుధ కర్మాగారంపై మూడు డ్రోన్లు దాడి చేయగా వాటిలో రెండింటిని కూల్చేశామనీ.. మూడో డ్రోన్ వల్ల స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొంది. తమ ప్రాథమిక దర్యాప్తులో ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్లు తేలిందన్న ఇరాన్.. తగిన సందర్భంలో సరైన రీతిలో బదులిస్తామని పేర్కొంది. అంటే, ఇజ్రాయెల్‌పై దాడికి దిగుతామని పరోక్షంగా ఐక్యరాజ్యసమితికి తేల్చి చెప్పారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి.. ఇరాన్ అణ్వస్త్రాలు ప్రయోగించకుండా అడ్డుకోవడమే ఇజ్రాయెల్ తొలి ప్రాధాన్యం. ఇజ్రాయెల్ రెండు పనులు చేయాల్సి ఉంది. వాటిలో మొదటిది ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఆపడమైతే.. రెండోది అణ్వస్త్రాలు ప్రయోగించే వ్యవస్థలు ఇరాన్‌కు దక్కకుండా చేయడం. దీనికి తోడు ఇరాన్ అభివృద్ధి చేసిన పలు రకాల ఆయుధాలను సిరియా, లెబనాన్, పాలస్తీనాకు సరఫరా చేయడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇస్ఫహాన్‌లోని క్షిపణి కేంద్రాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరహా దాడులు చేయడంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌ది అందెవేసిన చేయి. ఇప్పుడు కూడా మొస్సాద్ తన సీక్రెట్ ఏజెంట్ల సాయంతోనే ఇస్ఫహాన్ నగరంలో ఉన్న క్షిపణి కేంద్రాలను అతిదగ్గర నుంచి ప్లాన్ చేసి కొట్టినట్టు మిలటరీ ఎక్స్‌పర్ట్స్ అనుమానిస్తున్నారు. ఇరాన్ సైతం ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తోంది. మొస్సాద్‌కు చెందిన వారు కాకుండా మరే ఇతర వ్యక్తులకూ ఇస్ఫహాన్‌లో దాడులు చేసే సీన్ ఉండదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఈ దాడి వెనుక రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కోణం కూడా ఉందని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. దీనికి ఇరాన్ డ్రోన్లే కారణమని వెస్ట్రన్ మీడియా చెబుతోంది. పశ్చిమ దేశాల ఆరోపణలకు కారణం ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఉపయోగిస్తున్న ఇరాన్ డ్రోన్లే. ఇరాన్ నుంచి అందిన షహీన్ డ్రోన్లతో మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ డ్రోన్లు తమకు కలిసి రావడంతో ఇరాన్ నుంచి క్షిపణులు కూడా కొనాలని మాస్కో భావిస్తున్నట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సాయంతో క్షిపణి కేంద్రంపై అమెరికానే దాడి చేయించిందనే ప్రచారం ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ విషయాన్ని కాస్త తాజా పరిణామాలతో ఇరాన్ అణు ఒప్పందంపై ఆశలూ క్రమంగా తగ్గుతున్నాయి. ఈ టైంలో జరిగే ఈ దాడులకు ఇరాన్ స్పందించి.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చడమో.. అమెరికా, యూరప్ తో అణు ఒప్పందం చర్చలను కొనసాగించడమో తేల్చుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ సైనిక ఇంటెలిజెన్స్ మాజీ అధికారి గ్రిన్ బెర్గ్.. రేడియో ఫ్రీ యూరప్ రేడియో లిబర్టీ పత్రికకు చెప్పారు. ఓవరాల్‌గా తాజా దాడులతో ఇరాన్ తెగిస్తే మరో భీకర యుద్ధం మొదలైనట్టే అనే విశ్లేషణలే వినిపిస్తున్నాయి.