వరుస భూకంపాలతో అతలాకుతలం అవుతున్న టర్కీ కోసం భారత్ సరికొత్త ఆపరేషన్ ను చేపట్టింది. టర్కీని ఆదుకునేందుకు ఆపరేషన్ దోస్త్ పేరుతో ఆ దేశానికి అవసరమైన అన్ని రకాల సామాగ్రిని పంపిస్తోంది భారత్. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేక కార్గో విమానాల ద్వారా టర్కీకి కావాల్సిన ఎమర్జెన్సీ పరికరాలను మరియు మందులు, ఇతర మెడికల్ పరికరాలను పంపించింది భారత్. వీటితో పాటు అత్యుత్తమ వైద్యులతో కూడిన వైద్య బృందాన్ని కూడా టర్కీకి పంపించింది. భూకంపం సంభవించిన 24 గంటల్లోనే టర్కీకి 100 మంది సభ్యులతో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన పంపిన భారత ప్రభుత్వం.. ఆ తర్వాత టర్కీలో వరుస భూకంపాలు సంభవించటం.. అగ్ని ప్రమాదాలు సంభవించటంతో టర్కీకి కావాల్సిన అన్ని రకాల సాయాన్ని చేస్తూ వస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ కు ఆపరేషన్ దోస్త్ అని నామకరణం చేసింది భారత్.
సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంతో టర్కీలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా.. ఆ తర్వాత కూడా సుమారు 48 గంటల పాటు 5 సార్లు భారీ భూకంపాలు టర్కీని అతలాకుతలం చేశాయి. సుమారు 125 సార్లు రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతను మించిన ప్రకంపనలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ పైప్ లైన్లు ధ్వంసం కావటంతో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఒకే సమయంలో దేశంలోనే వందలాది చోట్ల ప్రమాదాలు సంభవించటంతో రెస్క్యూ సిబ్బంది సంఖ్య ఏమాత్రం సరిపోలేదు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ ఆర్మీని టర్కీ, సిరియా దేశాలకు సాయం అందించేందుకు పంపించాయి. శతృదేశమైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ఉద్దేశంతో భారత్ టర్కీకి మిగతా దేశాలను మించిన సాయం అందిస్తోంది. ఎప్పుడూ టర్కీకి వంతపాడే పాకిస్తాన్ మాత్రం నోరు తెరవటం లేదు. పైగా.. టర్కీకి సాయం అందించటానికి బయల్దేరిన భారత విమానాలు తమ దేశ గగనతలం గుండా వెళ్ళకూడదంటూ అడ్డుపడుతోంది పాకిస్తాన్.