ఇండియన్ క్రికెట్ టీమ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఏకకాలంలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించి క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే టీ20, వన్డే ఫార్మాట్లలో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్న టీమిండియా.. నాగ్ పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించటం ద్వారా 115 రేటింగ్ పాయింట్లు పొందిన టీమిండియా టెస్టుల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ కైవసం చేసుకుంది. తద్వారా మూడు ఫార్మాట్లలో ఏకకాలంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. టెస్టుల్లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా నిలవగా.. ఇంగ్లాండ్, న్యూజీలాండ్, సౌతాఫ్రికా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఇంతకు ముందు ఇలాంటి రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఏక కాలంలో అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ ప్లేస్ సాధించిన మొదటి టీమ్ గా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించగా మళ్ళీ అలాంటి రికార్డు టీమిండియా పేరిట నమోదైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ లో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఫిబ్రవరి 17న రెండో టెస్ట్ ఢిల్లీలో జరగాల్సి ఉంది.