3 వన్డేల సిరీస్ లో భాగంగా రాయపూర్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ కు భారత బౌలర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన కివీస్ ప్లేయర్లను వచ్చినోళ్ళను వచ్చినట్టే పెవిలియన్ కు పంపించేశారు మన బౌలర్లు. క్రీజులో కుదురుకోవటం కాదు కదా.. సరిగ్గా నిలబడలేకపోయారు కివీస్ బ్యాట్స్ మెన్ మన బౌలర్ల ధాటికి. దీంతో న్యూజీలాండ్ 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజీలాండ్ చరిత్రలో ఇది మూడో అతి తక్కువ స్కోర్ గా రికార్డైంది. 3 వికెట్లతో మహ్మద్ షమీ విజృంభించగా.. వాషింగ్టన్ సుందర్, హార్థిక్ పాండ్యా తలో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, షార్థూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టి కివీస్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేయటంలో తమ వంతు పాత్ర పోషించారు.
న్యూజీలాండ్ టీమ్ లో గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే 36 పరుగులతో చెప్పుకోదగిన స్కోరు సాధించగా.. మిచెల్ సాంటర్ 27 రన్స్, మిచెల్ బ్రేస్ వెల్ 22 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్ మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. అతి కష్టం మీద కివీస్ 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఇక ఫస్ట్ వన్డేలో భారీ స్కోర్ చేసి కివీస్ ను చిత్తు చేసిన భారత బ్యాట్స్ మెన్ ఈ మ్యాచ్ లో ఏం చేస్తారో. జస్ట్ ఇలా వచ్చి అలా మ్యాచ్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారా.. లేక ఫస్ట్ మ్యాచ్ లాగా టెన్షన్ పెట్టేస్తారా చూడాలి.