ఇండోర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడో గ్రాండ్ విక్టరీతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది భారత్. టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యంతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ల సెంచరీలతో భారత్ 385 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజీలాండ్ ముందుంచింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కివీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో బాల్ కే కివీస్ ఓపెనర్ అలెన్ ను హార్థిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపాడు. ఇక కివీస్ కుదురుకోవటం కష్టమే అనుకునే సమయంలో మరో ఓపెనర్ కన్వే గట్టి స్టాండింగ్ తో ఫోర్లు, సిక్సర్లు బాదేసి సెంచరీ తో పోరాడినా కివీస్ కు విజయం దక్కలేదు. నికోలస్, మిచెల్ వంటి బ్యాట్స్ మెన్ కాస్త పోరాడినా అదీ వృధానే అయ్యింది.
కుల్దీప్ యాదవ్, షార్ధూల్ ఠాకూర్ లు చెరో 3 వికెట్లు పడగొట్టి కివీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. చాహల్ రెండు వికెట్లు, మాలిక్, పాండ్యా చెరో వికెట్ పడగొట్టి తమ వంతు పాత్ర పోషించారు. 41.2 ఓవర్లలో 295 పరుగుల వద్ద కివీస్ ఆలౌటైంది. విజయం కోసం కివీస్ బ్యాట్స్ మెన్ గట్టిగానే పోరాడినా.. ఒత్తిడిని తట్టుకోలేని న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేక పెవిలియన్ చేరారు. మొత్తానికి 3 వన్డేల సిరీస్ ను భారత్ కు అప్పజెప్పింది న్యూజీలాండ్. వన్డే సిరీస్ ముగియగా.. 3 టీ20 ల సిరీస్ మొదలుకానుంది.