ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి దాదాపు ఏడాది గడిచిపోతున్నా.. ఇంకా నువ్వా నేనా అన్నట్లుగానే వార్ సాగుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే పుతిన్‌కు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయమే. రెండు, మూడు నెలల్లోనే ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ధీమా ఇప్పుడు కనిపించడం లేదు. అయినా ఇది ఏమాత్రం బయటపడనీకుండా ఎప్పటికప్పుడు పుతిన్ వార్ వన్ సైడే అన్నట్లు చెప్పడం కామన్‌గా మారిపోయింది. అయితే ఉక్రెయిన్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే పుతిన్ మరోసారి నో డౌట్ ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామని అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు మాట్లాడారనే చర్చ ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. గతేడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ వార్.. నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు ధ్వంసమవగా… వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. అయినప్పటికీ ఏ దేశం కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటూనే కదనరంగంలో కదం తొక్కుతున్నాయి. ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల.. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని చాలా నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇన్ని నెలలు అయినా.. రష్యా సైన్యానికి ఉక్రెయిన్ సోల్జర్స్ ఏమాత్రం తలవంచట్లేదు. 11 నెలలుగా రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొంటోన్నారు. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించి… రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగారంటే అది సాధారణ విషయమేమీ కాదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ..వారిని వెనక్కి పంపించి ప్రపంచ దేశాల చూపును తమవైపు తిప్పుకున్నారు. మొక్కవోని పట్టుదలను, దేశంపై ఉన్న ప్రేమను ఎలుగెత్తి చాటుతూనే, రష్యా అహంకారాన్ని ఎప్పటికప్పుడు తుంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఉక్రెయిన్‌పై దాడి చేసి దాదాపు ఏడాది కావొస్తున్న ఈ టైమ్‌లో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఉక్రెయిన్‌పై కచ్ఛితంగా విజయం సాధించి తీరుతామని .. అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో కాలంలో తమకూ ఎదురుదెబ్బలు తగిలిన వాస్తవమేనని, అయినా సరే రష్యా దళాలు కచ్ఛితంగా విజయం సాధిస్తాయని అన్నారు. రష్యా ప్రజల ఐక్యత, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా తమకే గెలుపు దక్కుతుందని చాలా నమ్మకంగా చెప్పారు. లెనిన్‌గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాన్ని పుతిన్ సందర్శించనపుడు ఆయన చేసిన ఈ కామెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగి ఏడాది అవబోతున్నా, ఆ దేశాన్ని ఓడించలేకపోయిందన్న విషయాన్ని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నట్టే చేసుకొని, ఉక్రెయిన్ బలగాల దాటికి రష్యా సైనికులు వెనకడగు వేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి రష్యా దాడులకు ప్రతిదాడులతో ఉక్రెయిన్ చాలా సందర్భాల్లో గట్టి సమాధానమే ఇచ్చింది. యూఎస్ సహా ఇతర దేశాల నుంచి కూడా ఉక్రెయిన్‌కి మద్దతు లభిస్తోంది. రానురాను రెండుదేశాల మధ్య దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో తాము ఈ యుద్ధంలో తాము గెలుస్తామా? లేదా? దీని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న భయాలు, అనుమానాలు రష్యాలోని ప్రజల్లో మొదలయ్యాయి. దీని కోసమే పుతిన్.. యుద్ధం గెలిచితీరుతామని చెప్పారన్న వాదన వినిపిస్తుంది.
తూర్పు ఉక్రెయిన్‌లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకే తాము ఆ దేశంపై సైనిక చర్యకు దిగినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సీనియర్ సైనికాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా మద్దతున్న వేర్పాటువాదులు ఉక్రెయిన్ దళాలతో 2014 నుంచి పోరాడుతున్నారని, ఈ సంఘర్షణను రూపుమాపే లక్ష్యంతో చర్చల కోసం రష్యా చాలా కాలంగా ప్రయత్నాలు చేసిందని అన్నారు. ఆ ప్రాంతంలో ఎనిమిదేళ్లుగా పెద్ద ఎత్తున ఆయుధాల వినియోగం కొనసాగుతోందని, అక్కడ నివసిస్తున్న ప్రజలను కాపాడేందుకు ఇప్పుడు తాము కూడా అదే దారిని ఎంచుకున్నట్లు చెప్పారు.
పుతిన్ ఇలా చెప్పడం ఇదే మొదటిసారి కాదు. ఉక్రెయిన్‌తో యుద్దాన్ని ముగించాలనుకుంటున్నామని, కానీ దీనికి దౌత్యపరమైన పరిష్కారం అవసరమని పుతిన్ చాలాసార్లు అన్నారు. తమ లక్ష్యం ఒక్కటేనని.. దీనికి ముగింపు పలకాలన్నదే అని డిసెంబర్‌లోనూ చెప్పారు. అప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అమెరికా వెళ్లి వాషింగ్టన్ లో అధ్యక్షుడు జోబైడెన్‌తో సమావేశమైన తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కి రక్షణ, ఆర్ధిక పరంగా మరింత సాయం చేస్తామని బైడెన్.. జెలెన్స్కీకి హామీ ఇవ్వడమే కాదు.. తమ భేటీ అయిన మరుసటిరోజే.. ఉక్రెయిన్ కి 1.7 ట్రిలియన్ డాలర్లు సాయం చేసేందుకు తమ సెనేట్ బిల్లును ఆమోదించేలా ఆయన చూశారు. అటు అమెరికా సెనేట్, ప్రతినిధుల ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన జెలెన్స్కీ.. తమ దేశానికి అవసరమైన సాయాన్ని అమెరికా నుంచి రాబట్టడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అవసరమైతే సైనికపరంగా మరింత సాయం చేయడానికి కూడా తాము సిద్ధమని అమెరికా.. ఆయనకు హామీ ఇచ్చింది.
మరోవైపు.. అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే, రష్యాకు వ్యతిరేకంగా జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ కొత్త ఆధునిక ఆయుధాల కోసం, ముఖ్యంగా భారీ యుద్ధ ట్యాంకులు కావాలని అభ్యర్థించింది. ఫిబ్రవరిలో రష్యా ఆక్రమించిన భూభాగాలను 2022 రెండో భాగంలో తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ జోష్‌తోనే ఉక్రెయిన్ ముందుకెళ్తోంది. రష్యా కొత్త దాడికి సిద్ధమవుతోందని భయపడటం వల్ల ఉక్రెయిన్‌కు ఆధునిక ట్యాంకులు, క్షిపణులను అందించడం చాలా కీలకమని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అన్నారు. జర్మనీ ఆమోదిస్తే చిరుతపులి ట్యాంకులను పంపిస్తామని పోలాండ్, ఫిన్లాండ్ ఇప్పటికే భరోసా ఇచ్చాయి. ఇటు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బుధవారం ప్రారంభమైన ఐరోపా దేశాల సైన్యాధ్యక్షుల సమావేశాల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం చర్చకు వచ్చింది. ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా సిద్ధమవుతోందని నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిర్సియా గెవొవన పేర్కొన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు కూటమి దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని, ఉక్రెయిన్‌కు అవసరమైనంత కాలం సాయం అందించాలని పిలుపునిచ్చారు.
రష్యాతో యుద్ధం కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆ దేశ మంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు. రాజధాని కీవ్‌కు సమీపంలోని బ్రోవరీ ప్రాంతంలోని కిండర్‌గార్డెన్ స్కూల్ వద్ద జనవరి 18న ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ , ఆయన సహాయ మంత్రి యెవ్‌జెనీ ఎనిన్ కూడా మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో పది మంది చిన్నారులు సహా మొత్తం 22 మంది ఆస్పత్రి పాలయ్యారు. దేశ అత్యవసర సేవలకు చెందిన హెలికాప్టర్‌లో మంత్రులు డెనిస్ , యెవ్‌జెనీ ఎనిన్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓవైపు ఐరోపా దేశాల సైన్యాధ్యక్షుల సమావేశంలో ఉక్రెయిన్‌కు సాయంపై హామీ ఇవ్వడం.. మరోవైపు ఉక్రెయిన్ హెలికాప్టర్ దుర్ఘటన జరిగిన తర్వాత పుతిన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.